మంచి సినిమాను ఏదీ ఆపలేదు, దానికి ఏ జిమ్మిక్కులూ అవసరం లేదు.. అదే సమయంలో బాగాలేని సినిమాను ఎంత లేపాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఈ రెండు విషయాలూ నిజమే కానీ.. సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువైపోయిన ఈ రోజుల్లో కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా మునిగిపోతుంటాయి. చెత్త సినిమాలు గట్టెక్కేస్తుంటాయి. అందుకే విడుదలకు ముందు సినిమాకు హైప్ తీసుకురావడం చాలా కీలకంగా మారింది.
ఆ హైప్‌తో ఓపెనింగ్స్ తెచ్చుకుంటే చాలు.. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గత వారం వచ్చిన ‘ఖుషి’ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చింది. అది అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఉపయోగపడింది. టాక్ అటు ఇటుగా ఉన్నా వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ డివైడ్ టాక్ వల్ల సోమవారం నుంచి సినిమా క్రాష్ అయిపోయింది. ఇక ఈ వారం వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ పరిస్థితి దానికి భిన్నం.
షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ మీదే అందరి ఫోకస్ ఉండగా.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి ఆశించినంత బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్లుగా సాగడంతో సినిమా ఫలితం ఏమవుతుందో అన్న భయాలు నెలకొన్నాయి. మార్నింగ్ షోలకు జనం పలుచగా కనిపించారు. కానీ ఈ సినిమాకు టాక్ బాగా ప్లస్ అయింది. మంచి సినిమా.. వినోదానికి ఢోకా లేదు.. ఒక్క నవీన్ పొలిశెట్టి కోసం సినిమా చూడొచ్చు అనే టాక్ స్ప్రెడ్ అయి.. తొలి రోజు సాయంత్రానికి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. యుఎస్‌లో అయితే ఈ సినిమాకు అంచనాలను మించి వసూళ్లు వచ్చాయి.
సినిమాకు వచ్చిన టాక్‌కు తోడు నవీన్ పొలిశెట్టి రెండు రోజులుగా అక్కడే ఉంటూ సినిమాను ప్రమోట్ చేయడం కూడా ప్లస్ అయింది. శుక్రవారానికే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కుకు చేరువ అయిపోయింది. వీకెండ్ అయ్యేసరికి 7.5 లక్షల డాలర్ల మార్కును అందుకునేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో తొలి రోజును మించి వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎలాంటి గిమ్మిక్కులు లేకుండా కేవలం టాక్‌తో రియల్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.