ఇప్పుడు దేశవ్యాప్తంగా మన దేశం పేరుని ఇండియా నుంచి భారత్ గా మార్చడం గురించే చర్చ జరుగుతోంది. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే దాని మీద భిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ అధిక శాతం జనాలు మద్దతు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా మారి దానికి ఇండియాగా నామకరణం చేసుకున్న నేపథ్యంలో పేరు పరంగా దాన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే బిజెపి ఇలా చేసిందని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్ల మీద సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది. ఇప్పుడిది మెల్లగా సినిమాల మీద కూడా ప్రభావం చూపించేలా ఉంది.
ముందు కమల్ హాసన్ ఇండియన్ 2 సంగతి చూస్తే దీని పేరు భారతీయన్ 2గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. దర్శకుడు శంకర్ దానికి ఒప్పుకోరు. కాంగ్రెస్ కు మద్దతిచ్చే వ్యక్తిగా కమల్ హాసన్ ససేమిరా అంటారు. కాబట్టి ఏదో సరదాగా అనుకోవాల్సిందే తప్పింది ఎలాంటి మార్పు ఉండదు. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఇండియా గేట్ లో సైతం పాత పేరే ఉంటుంది. ఇప్పుడు జరిగిన సవరణ ప్రకారం భారతీయ గేట్ అవ్వాలి. కానీ పీరియాడిక్ డ్రామా కాబట్టి కథానుగుణంగా ఆ ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదు. అయినా సరే వీటి మీద సరదా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.
ఆ మాటకొస్తే గతంలో చాలా సినిమాలు ఇండియా టైటిల్ తో వచ్చాయి. సన్నీ డియోల్, శరత్ కుమార్ లాంటి వాళ్ళు వీటిలో నటించారు. అయితే భారత్ టైటిల్ తో సల్మాన్ ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో అప్పుడెప్పుడో శోభన్ బాబు మిస్టర్ భరత్ చేయడం తప్పించి ఆతర్వాత పెద్దగా లేవు. ఏదైతేనేం దీని ప్రభావమైతే రాబోయే సినిమాల్లో ఎంతో కొంత ఉంటుంది. క్రికెట్ టీమ్ తో పాటు అన్నిటి మీద ఈ పేరునే చూడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అఫ్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వస్తాయి. వరల్డ్ కప్పుకు టీమ్ ప్రకటన కన్నా ఇవాళ ఇదే హైలైట్ కావడం విశేషం.