ఎమోషనల్ సినిమాని ఎగబడి చూస్తున్నారు

మాములుగా భావోద్వేగాల ఆధారంగా నడిచే సినిమాలకు చాలా స్లో పికప్ ఉంటుంది. కనెక్ట్ అయితేనే జనం థియేటర్లకు వస్తారు. దానికి రెండు మూడు రోజులు పడుతుంది. కానీ కన్నడ లేటెస్ట్ హిట్ “సప్తసాగర దాచే అల్లెల్లో సైడ్ ఏ” మాత్రం దానికి అతీతంగా జనాన్ని ఆకట్టుకుంటూ మొన్న శుక్రవారంతో మొదలుపెట్టి అన్ని చోట్ల భారీ స్పందన దక్కించుకుంటోంది. దీని రీచ్ ఎంత బలంగా ఉందంటే హైదరాబాద్ లో ఇచ్చిన కొన్ని షోలు సైతం హౌస్ ఫుల్ అయ్యేంతగా మౌత్ టాక్ పాకిపోయింది. 777 ఛార్లీతో మనకూ దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామాలో అంతగా ఏముందంటే.

నగరంలోనే బడా వ్యాపారవేత్తగా పేరున్న శేఖర్ గౌడ(అవినాష్)దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తుంటాడు మను(రక్షిత్ శెట్టి). ఇతను ప్రేమిస్తున్న ప్రియా(రుక్మిణి వసంత్) గాయని కావాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. సముద్రం దగ్గర ఇల్లు కట్టుకోవాలని ఆమె కల. యజమాని కొడుకు చేసిన తప్పు వల్ల డబ్బు కోసం ఆ నేరం తన మీద వేసుకుని ప్రియా వద్దంటున్నా జైలుకి వెళ్తాడు మను. బెయిల్ రాకుండానే శేఖర్ చనిపోతాడు. కటకటాల్లో ఉన్న మను మీద ఒక గ్యాంగ్ కక్ష కడుతుంది. ఈలోగా ప్రియా లైఫ్ లో ఊహించని పెద్ద మలుపు చోటు చేసుకుంటుంది. అదేంటో తెరమీద చూడాలి.

ఒక డిఫరెంట్ టోన్ లో దర్శకుడు హేమంత్ ఈ సినిమాని తెరెకెక్కించాడు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా తపన పడే పాత్రలో మనుగా రక్షిత్ శెట్టి హృదయాలను కదిలిస్తాడు. క్లైమాక్స్ గొప్పగా పండింది. జైలు బ్యాక్ డ్రాప్ లో ఎపిసోడ్స్ ఊహించని విధంగా సాగుతాయి. లవ్ స్టోరీకి వీటిని ముడిపెట్టిన తీరు డైరెక్టర్ ప్రతిభకు నిదర్శనం. నెరేషన్ కొంత స్లో ఉన్నప్పటికీ ఫీల్ గుడ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యింది. హీరోయిన్ రుక్మిణి వసంత్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. ఇది మొదటి భాగమే. సైడ్ బి త్వరలో రిలీజ్ చేస్తారు. దీన్ని తెలుగులో రీమేక్ చేయడం కన్నా డబ్బింగ్ గా అందిస్తేనే మంచి రెస్పాన్స్ వస్తుంది.