గణేషుడి పండక్కు బాలయ్య జోష్

అఖండ, వీరసింహారెడ్డి వరస బ్లాక్ బస్టర్ల తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమాగా భగవంత్ కేసరి మీద భారీ అంచనాలున్నాయి. అసలు అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడం హైప్ కి పగ్గాలు లేకుండా పోయాయి. తన రెగ్యులర్ కామెడీ పంధా కాకుండా పటాస్ టైపులో మాస్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్న ఈ సూపర్ హిట్ డైరెక్టర్ మీద ఫ్యాన్స్ బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. అక్టోబర్ 19 దసరా పండగ సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియోని సరిగ్గా సందర్భం చూసి వినాయక చవితి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు.

ఇంత ప్రత్యేకంగా దీని గురించి ప్రస్తావించడానికి కారణముంది. ఇప్పటిదాకా తెలుగులో వినాయకుడికి సంబంధించి తెలుగు సినిమాల్లో చాలా తక్కువ పాటలు అందుబాటులో ఉన్నాయి. వెంకటేష్ కూలి నెంబర్ 1లో అండ్రాలయ్యా ఉండ్రాలయ్యా, జై చిరంజీవలో జైజై గణేశా జైకొడతా లాంటివి మాత్రమే బాగా ప్రచారంలో ఉన్నాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బాలయ్య నుంచి ఒక ఊపిచ్చే సాంగ్ రావడం విశేషం. శంభో శంభోరే లంబోదరా ఆయారే అంటూ సాగే సాహిత్యంతో కాసర్ల శ్యామ్ లిరిక్స్ సమకూర్చగా కరీముల్లా, మనీషా పండ్రంకి గాత్రం అందించారు.

తమన్ ఫాస్ట్ బీట్ జోరుగా ఉండగా బిడ్డా, చిచ్చా అంటూ బాలకృష్ణ, శ్రీలీలలు హుషారుగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు వేయడం తీన్ మార్ అనిపించేలా ఉంది. లిరికల్ వీడియో కాబట్టి మొత్తం డాన్స్ రివీల్ చేయలేదు కానీ రాబోయే గణేష్ మండపాల్లో విగ్రహాల దగ్గర పెట్టేందుకు మంచి మాస్ ట్యూన్ ఇచ్చాడు తమన్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భగవంత్ కేసరిలో విలన్ గా అర్జున్ రామ్ పాల్ టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు బలమైన ఎమోషన్స్ తో అనిల్ రావిపూడి కంప్లీట్ ప్యాకేజీగా తీర్చిదిద్దారట.

https://www.youtube.com/watch?v=wHYKdQIZswc