పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు మీద గత ఏడాది వరకు అభిమానులకు భారీ ఆశలు ఉండేవి. క్రమం తప్పకుండ వాయిదాలు పడటం, నిర్మాత ఏఎం రత్నం నుంచి అప్డేట్స్ లేకపోవడం, దర్శకుడు క్రిష్ మీడియాకు దొరక్కుండా మాయం కావడం తదితరాలు ఎన్నో అనుమానాలకు తెరలేపాయి. దీన్ని పక్కనపెట్టి తక్కువ టైంలో బ్రో పూర్తి చేయడమే కాక ఉస్తాద్ భగత్ సింగ్, ఓజిల మీద పవర్ స్టార్ ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఒక దశలో ఇది ఆగిపోయిందేమోననే ప్రచారం కూడా జరిగింది.
ఎట్టకేలకు సూర్య మూవీస్ టీమ్ లో కదలిక వచ్చింది. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మధ్యాహ్నం కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరుకుంటున్నది అది కాదు. అసలు విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందని. రేపు ఆ శుభవార్తని కొత్త లుక్ తో పాటు పొందుపరుస్తారని ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అలాంటి అనౌన్స్ మెంట్ ఉండకపోవచ్చని తెలిసింది. కమింగ్ సూన్ లేదా 2024 సమ్మర్ అని తప్ప ఫలానా డేట్ ని ఖచ్చితంగా నిర్ధారించే ఛాన్స్ లేకపోవచ్చు. ఎందుకంటే బ్యాలన్స్ షూట్ ఎప్పటిలోగా పూర్తవుతుందనేది తెలియాల్సి ఉంది.
సరే ఈ మాత్రమైనా మూమెంట్ వచ్చినందుకు సంతోష పడటం తప్ప ఎవరేం చేయలేరు కానీ చల్లారిపోయిన హైప్ ని మళ్ళీ బ్రతికించాల్సిన బాధ్యత వీరమల్లు బృందం మీద ఉంది. ఇప్పటికే సగానికి పైగా షూట్ పూర్తయిందన్నారు కానీ ఎంత శాతమనేది ఇంకా గుట్టుగానే ఉంది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. పవన్ కళ్యాణ్ ఇంకో రెండు నెలల కంటే ఎక్కువ షూట్లలో ఉండలేరు. జనసేన కోసం ప్రచారాలు, సీట్ల ఆర్భాటాలు, నామినేషన్లు, మీటింగులు ఇలా ఎన్నో ఉంటాయి. పైగా హరిహర వీరమల్లు కోసం జుత్తు పెంచాల్సి ఉంటుంది. చూడాలి రేపు మధ్యాన్నం ఈ సస్పెన్స్ వీడిపోనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates