అయిదేళ్ల తర్వాత లాభాలొచ్చాయి

నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో సిద్దార్థ త్రిష అన్న శ్రీహరితో పందెం కట్టి నా పొలంలో మొలకలొచ్చాయని సంబరపడినట్టుగా ఉంది హీరో కార్తికేయ పరిస్థితి. ఆరెక్స్ 100 రిలీజైన టైంలో ఇతని ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2018 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచి రెండో సినిమాతోనే పెద్ద గుర్తింపు తెచ్చి పెట్టింది. కట్ చేస్తే ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కటి ప్రాపర్ హిట్ లేకుండా పోయింది. హిప్పీ, గుణ 369, నైన్టీ ఎంఎల్, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టాయి. విలన్ గా చేసిన నాని గ్యాంగ్ లీడర్ సైతం ఫ్లాపుల బ్యాచులోకే వెళ్లిపోయింది.

అజిత్ వలిమై కమర్షియల్ సక్సెసే కానీ అది కూడా ప్రతినాయకుడి పాత్రే కాబట్టి కౌంట్ లోకి రాదు. సో కార్తీకేయ సోలో హీరోగా సక్సెస్ చూసి అయిదేళ్ళు దాటేసింది. బెదురులంక 2012 ఆ లోటుని తీర్చింది. తక్కువ థియేట్రికల్ బిజినెస్ కి తోడు మూవీకి డీసెంట్ టాక్ రావడం వల్ల మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ జరిగిపోవడం ఊరట కలిగించే విషయం. నాలుగున్నర కోట్ల టార్గెట్ తో బరిలో దిగి ప్రస్తుతం యాభై లక్షల లాభంతో రెండో వారంలోనూ కొనసాగనుంది. బిసి సెంటర్స్ లో రెస్పాన్స్ బాగుందని కౌంటర్ సేల్స్ చెబుతున్నాయి. శుక్రవారం ఖుషి జోరుని బట్టి పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది.

మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ కార్తికేయకు రిలీఫ్ కలిగింది. నిజానికి బెదురులంక ఏప్రిల్ నుంచి వాయిదా పడుతూ వస్తూనే ఉంది. కొంత రీ షూట్ చేశారనే టాక్ కూడా వచ్చింది, ఎట్టకేలకు గాండీవధారి అర్జున లాంటి భారీ చిత్రం ఉన్నా రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. యూత్ ఫుల్ మూవీగా విపరీతంగా ప్రమోట్ చేసిన కన్నడ డబ్బింగ్ బాయ్స్ హాస్టల్ కన్నా బెదురులంక 2012 చాలా మెరుగ్గా వసూళ్లు రాబట్టడం విశేషం. దీని రిలీజ్ ముందు వరకు కొంచెం టెన్షన్ గా ఉన్న కార్తికేయ మొహంలో టెన్షన్ తగ్గిన వైనం సక్సెస్ మీట్స్ లో కనిపిస్తోంది.