ప్రవీణ్ సత్తారు అనే పేరు కొన్నేళ్ల ముందు వరకు అంత పాపులర్ ఏమీ కాదు. ఎల్బీడబ్ల్యూ అనే క్రౌడ్ ఫండింగ్ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందరూ కొత్త వాళ్లను పెట్టి తీసిన ఆ సినిమా కొంచెం లేటుగా ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆన్ లైన్లో చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాలతో వైవిధ్యమైన ప్రయాణం సాగించాడు ప్రవీణ్. సినిమా సినిమాకూ జానర్ మారుస్తూ.. ప్రతి సినిమాతోనూ తన అభిరుచిని చాటుతూ సాగాడు.
రాజశేఖర్‌తో ప్రవీణ్ తీసిన గరుడవేగ సినిమా దర్శకుడిగా అతడిని చాలా మెట్లు ఎక్కించింది. అందరూ మరిచిపోయిన రాజశేఖర్‌ను పెట్టి అతను ఉత్కంఠభరిత థ్రిల్లర్ తీసి ఆశ్చర్యపరిచాడు. ప్రవీణ్ స్థాయిని ఎంతో పెంచిన సినిమా ఇది. అప్పటిదాకా ప్రవీణ్ మీద పెద్దగా అంచనాలు లేవు. అంచనాలు లేనపుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి మెప్పించిన ప్రవీణ్.. తనపై అంచనాలు పెరిగాక మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు.
గరుడవేగ చూసి ఇంప్రెస్ అయి అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అతడికి ఛాన్స్ ఇచ్చాడు. నిర్మాతలు పెద్ద బడ్జెట్ పెట్టారు. కానీ ది ఘోస్ట్‌తో అతను ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. గరుడవేగలో చూపించిన నైపుణ్యం ఈ సినిమాలో కనిపించలేదు. ఆ తర్వాత అయినా తప్పులు దిద్దుకుని ఒక పకడ్బందీ సినిమాను అందిస్తాడేమో అనుకుంటే.. తాజాగా గాండీవధారి అర్జునతో మరింతగా డిజప్పాయింట్ చేశాడు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అంతో ఇంతో ది ఘోస్ట్ మూవీనే నయం అన్నట్లుగా ఈ సినిమా కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంచనాలు లేనపుడు మంచి మంచి సినిమాలు తీసిన ప్రవీణ్.. తనపై అంచనాలు పెరిగాక ఇలా నిరాశ పరచడమేంటో?