వింటేజ్ నాగార్జున కోసం కొనేస్తున్నారు

రీ రిలీజుల పర్వంలో కాస్త ఆలస్యంగా అయినా సరే నాగార్జున సరైన సినిమాతోనే వస్తున్నారు. ఎల్లుండి విడుదల కాబోతున్న మన్మథుడు బుకింగ్స్ ఆశించిన దానికన్నా బాగుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉదయం వేసిన షోలన్నీ హౌస్ ఫుల్ కాగా మిగిలిన నగరాల్లోనూ స్పందన ఇదే స్థాయిలో పెరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో కె విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ ని ఈ తరం యువత థియేటర్లో చూసుండరు. అందుకే బిగ్ స్క్రీన్ షో అనగానే ఆ ఫీలింగ్ కోసం పోటీపడి టికెట్లు కొనేస్తున్నారు.

నాగార్జున ఫాన్స్ సెంటిమెంట్ గా ఫీలయ్యే దేవి 70 ఎంఎం చాలా గ్యాప్ తర్వాత సోల్డ్ అవుట్ కావడం వాళ్ళకో నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తోంది. సంగీత ప్రియులు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని డాల్బీ ఆడియోలో ఆస్వాదించాలని ఫిక్స్ అయిపోయారు. సోనాలి బెంద్రే హీరోయిన్ గా నటించిన మన్మధుడులో లవంగంగా బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్ లో పేలింది. ఇప్పటికీ దాని మీద మీమ్స్ వస్తూనే ఉంటాయి. సింపుల్ పంచులే అయినా పదే పదే గుర్తు చేసుకుని మరీ నవ్వుకునేలా మాటల మాంత్రికుడు సంభాషణల గురించి చెప్పదేముంది.

నాగ్ పుట్టినరోజు సందర్భంగా దీంతో పాటు ఆయన 99వ సినిమా అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గలాటా, నా సామి రంగా రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఒకటి ఫిక్స్ చేస్తారు. గత కొంత కాలంగా వరస డిజాస్టర్లతో ఓపెనింగ్స్ లో వెనుకబడుతున్న నాగార్జునని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో మన్మథుడు బుకింగ్స్ ఋజువు చేస్తున్నాయి. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల వైల్డ్ డాగ్, ఘోస్ట్ లాంటి ఫలితాలు వస్తున్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అన్నట్టు శివ నెగటివ్ దొరికిందట. త్వరలోనే దీన్ని కూడా గ్రాండ్ గా రీరిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది.