ఒకపక్క హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఐపిఎల్ లో పరాజయాలు, మరోవైపు భారీ సినిమాలు ఎన్ని తీస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదనే బాధతో ఉన్న సన్ టీవీ సంస్థకు జైలర్ బంగారు బాతులా కనక వర్షం కురిపిస్తూనే ఉంది. మూడో వారంలోకి అడుగు పెట్టేసి 600 కోట్ల గ్రాస్ తో తమిళంలో అంత సులభంగా ఎవరూ అందుకోలేని నెంబర్లు రజనీకాంత్ నమోదు చేస్తున్నారు. మొన్న వీక్ డేస్ లో కొంత నెమ్మదించినప్పటికీ తిరిగి వారాంతంలో పుంజుకుని అనూహ్యంగా ఆక్యుపెన్సీలు పెంచేసుకుంటోంది. ఫైనల్ రన్ అయ్యేలోపు ఇంకో వంద కోట్లకు పైగా తోడయ్యేలా ఉంది.
బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగానే కాదు సన్ టీవీకి సంబంధించిన షేర్ మార్కెట్ ధర కూడా జైలర్ పుణ్యమాని అమాంతం పెరిగిపోతోంది. జూన్ చివర్లో 494 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా 592 రూపాయలు దాటేసింది. ఇదంతా జైలర్ ప్రభావమేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ రెవిన్యూలో పది శాతం పెరుగుదలతో 1349 కోట్లకు చేరుకుంది. ఇది జైలర్ ముందు 1219 కోట్ల దగ్గర ఉంది. లాభాలు 55 శాతం పెరగడం అనూహ్యం. జైలర్ హక్కులు సన్ టీవీవి కావడం, త్వరలో ప్రీమియర్ జరిగి అమాంతం రాబడి పెరుగుతుందనే నేపథ్యంలో ధర దూసుకుపోతోంది.
ఒక సినిమా ఫలితం వల్ల సదరు కంపెనీ స్టాక్ మార్కెట్ ప్రభావం చెందడం అరుదుగా జరుగుతుంది. ఇదంతా రజని మానియా ఎఫెక్ట్ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పటికైతే ఇతర భాషల్లో కొంత దూకుడు తగ్గినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మాత్రం తగ్గేదెలా అంటోంది. దెబ్బకు కొత్త రిలీజులు కొన్ని వాయిదా పడగా ధైర్యం చేసి వచ్చినవి సోసోగానే ఆడుతున్నాయి. సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ తో పాటు వీలైనంత త్వరగా శాటిలైట్ ప్రీమియర్ కు ప్లాన్ చేస్తోంది యాజమాన్యం. టిఆర్పిలో సరికొత్త రికార్డులు నమోదవుతాయని అప్పుడే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి.