బాలయ్యకి ఎందుకు కోపమొచ్చింది?

నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కాడంటే చాలు ఫోకస్ అంతా ఆయన వైపు మళ్లుతుంది. తన సినిమాల వేడుకలైనా.. వేరే చిత్రాల ఈవెంట్లలో అయినా బాలయ్య చేసే సందడే వేరుగా ఉంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎలా ప్రవర్తిస్తాడో తెలియనట్లుగా ఉంటుంది బాలయ్య తీరు. పక్కనున్న వాళ్ల మీద పంచులు వేస్తాడు. కొన్నిసార్లు కోప్పడతాడు. చిన్న పిల్లాడిలా అల్లరి కూడా చేస్తాడు.

తాజాగా ‘స్కంద’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ బాలయ్య అల్లరి మామూలుగా లేదు. స్టేజ్ మీద బాలయ్య ఉన్నంతసేపు ఫోకస్ మొత్తం ఆయన మీదే ఉంది. కొంచెం చిత్ర విచిత్రంగానే ప్రవర్తించాడు బాలయ్య ఈ ఈవెంట్లో. రామ్‌తో కలిసి ఆయన అల్లరి చేయడమే కాదు.. అతడికి వార్నింగ్ ఇవ్వడం, ఒక సందర్భంలో కోపగించుకోవడం కూడా జరిగింది. రామ్ తన గురించి పాట పాడతా అన్నపుడు బాలయ్య తల పట్టుకుని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఈ ఈవెంట్లో హైలైట్.

ఇక రామ్ స్పీచ్ మధ్యలో యాంకర్ సుమ కలుగజేసుకుని హీరోయిన్లు శ్రీలీల, సయీ మంజ్రేకర్‌లలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అని అడగ్గా.. రామ్ ఒక్క క్షణం ఆగి బాలయ్య వైపు చూపించాడు. బాలయ్య ముందుకు రాగా.. ఆయన ఉండగా వేరే వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడ్డమా అంటూ నవ్వేశాడు రామ్. ఐతే ఈ మాటకు బాలయ్య కోపగించుకున్నాడు. సీరియస్‌గా ఫేస్ పెట్టి హీరోయిన్ల గురించి మాట్లాడమంటే నా ప్రస్తావన ఏంటి అన్నట్లుగా లుక్ ఇచ్చాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఐతే కాసేపటికే నార్మల్ అయిన బాలయ్య.. రామ్‌తో సరదాగా గడిపాడు.

ఇక రామ్ తర్వాత మైక్ అందుకున్న బాలయ్య.. స్పీచ్ మొదట్లోనే యథాప్రకారం సంస్కృతంలో ఎవరికీ అర్థం కాని విధంగా శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టగానే ఆడిటోరియం హోరెత్తింది. ఆ తర్వాత తనదైన శైలిలో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్తూ బాలయ్య స్పీచ్‌ను లాగించాడు. మొత్తంగా నిన్నటి ఈవెంట్లో బాలయ్య విన్యాసాలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.