నిన్న సాయంత్రం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా జరిగిన స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ వచ్చేసింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి శీను ఊర మాస్ చూపించేశారు. ఇస్మార్ట్ శంకర్ లో చూసిన దానికి భిన్నంగా రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. విజువల్స్ గట్రా పూర్తిగా గూస్ బంప్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాసుకున్నట్టు కనిపించింది. శ్రీలీల హీరోయిన్ కావడంతో ఆ పాయింట్ కూడా బజ్ పరంగా ప్లస్ అవుతోంది. ఇక తమన్ సంగీతం మీద అంచనాల గురించి తెలిసిందే. కథని చెప్పీ చెప్పనట్టు చాలా తెలివిగా కట్ చేశారు.
కాలేజీలో చదువుకుంటున్నా ఎవరిని లెక్క చేయని తత్వం స్కంద(రామ్)ది. తప్పు జరిగినా, మీద పడినా కొట్టేస్తాడు. అందమైన అమ్మాయి(శ్రీలీల) ఎదురుగా ఉన్నా నువ్వేమైనా అందగత్తెవా అని చెప్పే టైపు. స్వంత ఊరిలో తండ్రి(దగ్గుబాటి రాజా)కో సమస్య వస్తుంది. దాని వెనుకే ప్రాణాలు తీసే ప్రమాదం పొంచి ఉంటుంది. దీంతో తనే రంగంలోకి దిగుతాడు. అయితే ఇది ఆషామాషీగా ఉండదు. కుటుంబ సభ్యులు సైతం రిస్క్ లో పడతారు. దీంతో స్కందలో అసలు విశ్వరూపం బయటకు వస్తుంది. ఊచకోత తప్ప ఇంకేమి తెలియని అవతారంలోకి మారిపోతాడు.
బోయపాటి శీను టిపికల్ మాస్ మొత్తం ట్రైలర్ లో కనిపించేసింది. అఖండ, జయ జానకి నాయక, లెజెండ్, సింహా షేడ్స్ ఉన్నప్పటికీ ఓవర్ ది టాప్ హీరోయిజంతో విజిల్స్ ఎలా వేయించుకోవాలో బాగా తెలిసిన దర్శకుడిగా తన పనితనం ఇందులో చూపించారు. అయితే కంటెంట్ మొత్తం వయొలెన్స్ నింపడంతో యూత్, ఫ్యామిలీస్ కి కావాల్సన అంశాలకు చోటు దొరకలేదు. అవి కూడా ఉన్నాయి కానీ ఎందుకనో దీంట్లో పొందుపరచలేదు. సెప్టెంబర్ 15న విడుదల కాబోతున్న స్కంద మీద థియేట్రికల్ క్రేజ్ చాలా ఉంది. దాన్ని నిలబెట్టుకుంటే హిట్టు పడ్డట్టే