అక్కినేని నాగార్జున తన కెరీర్లో ఎన్నడూ చూడని పతనాన్ని చూశాడు గత కొన్నేళ్లలో. దర్శకుడిగా పూర్తిగా పతనం అయిన రామ్ గోపాల్ వర్మను నమ్మి ‘ఆఫీసర్’ సినిమా చేయడం నాగ్ చేసిన అతి పెద్ద మిస్టేక్. ఆ దెబ్బతో ఆయన మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. మళ్లీ ఆ మార్కెట్‌ను తిరిగి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ‘వైల్డ్ డాగ్’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఆ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక గత ఏడాది వచ్చిన ‘ది ఘోస్ట్’ మూవీకి టాక్ కూడా రాలేదు. ఇక సినిమా ఏం నిలబడుతుంది? అదొక పెద్ద డిజాస్టర్ అయ్యాక నాగ్ పునరాలోచనలో పడిపోయాడు. కొత్త సినిమాను ఎంతకీ మొదలుపెట్టలేకపోతున్నాడు. స్క్రిప్టును లాక్ చేయడంలో.. అలాగే దర్శకుడిని ఖరారు చేయడంలో బాగా ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నా సామి రంగా’ పేరుతో తన కొత్త చిత్రాన్ని చేయాలని నాగ్ ఫిక్సయ్యాడు. ఐతే ఈ సినిమాను లాక్ చేయడంలో నాగ్ మీనమేషాలు లెక్కించాడు కానీ.. మొదలుపెట్టాక మాత్రం వ్యవహారం వేరుగా ఉండబోతోందట.
ఆగస్టు నెలాఖరులో సినిమా సెట్స్ మీదికి వెళ్లనుండగా.. కేవలం నాలుగు నెలల్లో రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగిన మూడున్నర నెలల్లో సినిమాను పూర్తి చేయడానికి నాగ్ ఫిక్సయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడు. సంక్రాంతికి సరైన సినిమా పడితే వసూళ్లు ఎలా ఉంటాయో నాగ్‌కు బాగా తెలుసు.
‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎలా ఆడిందో అందరికీ తెలుసు. ‘బంగార్రాజు’ లాంటి డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు కూడా మంచి కలెక్షన్లే వచ్చాయి. అందుకే నాగ్.. తన కొత్త చిత్రం ‘నా సామి రంగా’ను సంక్రాంతికి రిలీజ్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. ‘గుంటూరు కారం’, ‘ఈగల్’, ‘హనుమాన్’ లాంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఉంటుందని తెలిసినా నాగ్ తన సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.