నాలుగు వేదాలతో సూర్య – చందు సినిమా

ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలను డీల్ చేయడంతో ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం నాగ చైతన్యతో భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా టీమ్ మొత్తం ఇటీవలే నది తీర ప్రాంతాలకు వెళ్లి జాలర్ల జీవన విధానాన్ని తెలుసుకుని వచ్చారు. తండేల్ టైటిల్ పరిశీలనలో ఉంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇంకో వారంలో తెలిసిపోనుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెడతారు. దీని తర్వాత చందూ మొండేటి సూర్య ప్రాజెక్టుని పట్టేశాడు.

నాలుగు వేదాలు(రిగ్, యజుర్, సామ, అధర్వ) ఆధారంగా చేసుకుని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కథను సిద్ధం చేశానని సూర్య దాన్ని మెచ్చుకుని క్రమం తప్పకుండ స్క్రిప్ట్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారని చందూ చెప్పడం ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ ఖాళీగా లేరు. సూర్య డేట్లు రెండేళ్ల వరకు అందుబాటులో లేవు. కంగువా పూర్తి చేశాక వెట్రిమారన్ వడి వాసల్ తో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఈ లోగా చందూ మొండేటి తండేల్ పూర్తి చేసుకుని కార్తికేయ 3కి సంబంధించిన పనులు మొదలుపెట్టొచ్చు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు దర్శకులతో చేసేందుకు సూర్య ముందు నుంచి ఉత్సాహం చూపిస్తున్నాడు కానీ సరైన కాంబినేషన్ కుదరలేదు. టాలీవుడ్ లో తనకు ఎంత ఫాలోయింగ్ ఉందో ఇటీవలే సూర్య సన్ అఫ్ కృష్ణన్ కు వచ్చిన స్పందన చూసి అర్థం చేసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత చందూ మొండేటి ఒక ఫాంటసీ సబ్జెక్టుతో మెప్పించడం విశేషమే. టాప్ లీగ్ లోకి చేరాలని గట్టిగా ప్రయత్నిస్తున్న ఈ విలక్షణ దర్శకులు చైతు, సూర్య సినిమాలు ఆ కార్యాన్ని నెరవేరుస్తామని ఎదురు చూస్తున్నారు. ఒకపక్క చిరు పంచ భూతాలు, ఇంకోవైపు సూర్య నాలుగు వేదాలు మొత్తానికి విభిన్న కథలైతే తెరమీదకొస్తున్నాయి.