విడుదల ఎప్పుడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతమైన ఆశలు, అంచనాలు పెట్టుకున్నది ఓజి మీదే. హరిహర వీరమల్లుని మర్చిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ కనీసం సగం షూటింగ్ అయ్యాకే నమ్మాలని డిసైడయ్యారు. పైగా అది రీమేక్ కాబట్టి హరీష్ శంకర్ ఎన్ని మార్పులు చేసినా స్ట్రెయిట్ సబ్జెక్టుతో వస్తున్న ఓజి మీదే ఎక్కువ మమకారం చూపిస్తున్నారు. అయితే డిసెంబర్ విడుదల ఉండొచ్చనే వార్త ఆ మధ్య చక్కర్లు కొట్టింది కానీ దానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదని తెలిసింది. దీన్ని రెండు భాగాలుగా చేసి ఫస్ట్ పార్ట్ ని 2024 వేసవిలో వదలాలనేది నిర్మాత ఆలోచన.
ఇక అసలు విషయాని వస్తే ఓజిలో పవన్ పాత్ర పరిచయం కోసం దర్శకుడు సుజిత్ రెండు వర్షన్లు రాసుకున్నాడట. అందులో ఒకటి సుదీర్ఘమైన పదిహేను నిమిషాల నిడివితో విపరీతమైన రక్తపాతంతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ తో ఉందట. అయితే పవన్ కళ్యాణ్ కి ఇదే నచ్చడంతో సుజిత్ ఎవరూ చూపించని రేంజ్ లో దీన్ని షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పులిలో అచ్చం ఇలాగే ఒక లెన్తీ ఎపిసోడ్ ద్వారా హీరో ఫేస్ ని రివీల్ చేస్తారు. కానీ ప్రతి ఫ్రేమ్ లో గూస్ బంప్స్ ఉంటాయి. సుజిత్ అచ్చం ఇదే తరహాలో ఓజి పరిచయం ప్లాన్ చేశాడట.
గతంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ బాలు, పంజాలు చేసినప్పటికీ వాటిలో జరిగిన పొరపాట్లకు ఇందులో ఆస్కారం ఇవ్వకుండా సుజిత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంత ఖర్చు పెట్టినా సాహోకు ఆశించిన ఫలితం రాకపోవడానికి కారణం ఏంటో తనకు బాగా తెలుసు కాబట్టి ఈసారి దొరికిన స్వేచ్ఛని వాడుకుంటూ తనలో అభిమానిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. తమన్ సంగీతం మరో హైలైట్ కానుంది. బ్రో పాటల విషయంలో వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలిగా. సెప్టెంబర్ 2న టీజర్ రాబోతోంది.