మెగా అర్జునుడు స్పీడు పెంచాల్సిందే

ఇంకో అయిదే రోజుల్లో గాండీవధారి అర్జున విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి దేశ విదేశాల్లో షూటింగ్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ కి ఆశించిన స్థాయిలో ఇంకా బజ్ కనిపించడం లేదు. హీరో హీరోయిన్లు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నా వాటి తాలూకు ప్రభావం అంతంత మాత్రమే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ది ఘోస్ట్ రూపంలో ఫ్లాప్ అందుకున్నాక తిరిగి అదే జానర్ లో మళ్ళీ ఇంకో భారీ చిత్రం తీయడం నిజంగా సాహసమే. కంటెంట్ మీద అంత నమ్మకంతో ఉన్నారు.

సోలో వచ్చేదైతే గాండీవధారికి ఎలాంటి సమస్య లేదు. కానీ ఒకరోజు ముందు గురువారం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త దిగుతోంది. జైలర్ తరహా స్ట్రాటజీతో ఫ్రైడే సెంటిమెంట్ ని పక్కనపెట్టి అడ్వాన్స్ గా రిలీజ్ చేస్తున్నారు. టాక్ ఏ మాత్రం పాజిటివ్ ఉన్నా నిలబడిపోతుంది. అసలే మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. చాలా కాలంగా ఫామ్ లో లేని కార్తికేయ బెదురులంక 2012 మీద ఎంటర్ టైన్మెంట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. నేహా శెట్టి గ్లామర్, ట్రైలర్ లో చూపించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇవన్నీ ఏ మాత్రం వర్కౌట్ అయిన మరో చిన్న సినిమా మేజిక్ చేసినట్టే.

సో మెగా అర్జునుడు స్పీడ్ పెంచి పబ్లిసిటీని విస్తృతంగా చేయాలి. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య ఇందులో హీరోయిన్. విజువల్స్ గట్రా చాలా ఇంటెన్సిటీ అయితే చూపించాయి కానీ ఓపెనింగ్స్ కి కీలకంగా పనిచేసే బజ్ ఇంకా ఏర్పడాలి. రేపు హైదరాబాద్ జెఆర్సి కన్వేషన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. గెస్టు ఎవరనేది తెలియదు. పెదనాన్న చిరంజీవి ఆరోగ్యం దృష్ట్యా అందుబాటులో లేరు. పవన్ కళ్యాణ్ రావడం జరగని పని. మిగిలిన మెగా కుర్ర హీరోలతో పని జరిపించాల్సి ఉంటుంది. ఎవరైనా స్పెషల్ గెస్టు కోసమైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది హిట్టు కొట్టడం వరుణ్ కి చాలా అవసరం.