వైసీపీకి ‘జైలర్’ షాక్

సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్థాయికి తగ్గ హిట్ కొట్టి చాలా ఏళ్లయిపోయింది. సరిగ్గా చెప్పాలంటే ఆయన్నుంచి వచ్చిన నిఖార్సయిన చివరి హిట్ ‘రోబో’నే. ఆ తర్వాత ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. చివరి మూడు సినిమాలు పేట, దర్బార్, అన్నాత్తె అయితే ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరిచాయి. ‘అన్నాత్తె’కు సరైన ఓపెనింగ్స్ కూడా లేకపోవడంతో ఆయన పనైపోయిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. రజినీ ఫ్యాన్స్‌లో కూడా ఉత్సాహం బాగా తగ్గిపోయింది. ఇదే అదనుగా రజినీ గురించి తేలిగ్గా మాట్లాడేవాళ్లు ఎక్కువైపోయారు.

కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రజినీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని పొగడ్డమే పెద్ద తప్పయిపోయింది. ఆయన మీద వైసీపీ వాళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ గురించి పల్లెత్తు మాట అనకపోయినా.. చంద్రబాబును పొగడ్డమే వారి ఆగ్రహానికి కారణం. కొడాలి నాని అయితే పకోడీ గాడు.. చీకేసిన టెంక లాంటి మాటలు వాడాడు రజినీ గురించి.

రజినీ సినిమా చరిష్మా సంగతి పక్కన పెడితే.. వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడాయన. మృదు స్వభావి అయిన అలాంటి వ్యక్తిని నాని సహా వైసీపీ నేతలు తిట్టిపోసిన తీరు సామాన్య జనాలకు రుచించలేదు. రజినీని టార్గెట్ చేసే క్రమంలో ఆయన సినిమాల్లో జీరో అయిపోయాడని కూడా కామెంట్లు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది.

రజినీ హేటర్స్ అందరికీ ఈ సినిమా చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతోంది. యావరేజ్ కంటెంట్‌తోనే ‘జైలర్’ సినిమా నిలబడిందంటే సగం కారణం రజినీనే. కొన్ని ఫ్లాపులు వచ్చాయని ఆయన్ని తక్కువ అంచనా వేసిన వారికి ‘జైలర్’ వసూళ్లు పెద్ద షాకే. ఈ చిత్రం తెలుగులో కూడా అదరగొడుతోంది. ఏపీలో భారీ వసూళ్లు సాధిస్తోంది. రిలీజై వారం కావస్తున్నా హౌస్ ఫుల్స్ కొనసాగుతున్నాయి. రజినీ గురించి అంత తేలిగ్గా మాట్లాడాక.. ఆయన సినిమా తమ ముందే ఇరగాడేస్తుండటం వైసీపీ నేతలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంటుందనడంలో సందేహం లేదు.