వారం తిరగడం ఆలస్యం నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ ఖాతాలో వేసుకున్న రజనీకాంత్ జైలర్ లో బాగా హైలైట్ అయినవాళ్లలో విలన్ గా నటించిన వినాయకన్ కి ప్రత్యేక స్థానం ఇవ్వాలి. బక్కపలచని దేహం, పక్కా ఊర మాస్ అనిపించే మొహం, దాని కవళికలతో ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చిన ఇతను విశాల్ పొగరు కనక మీకు గుర్తుంటే అందులో శ్రేయా రెడ్డి పక్కన కేకలు పెట్టుకుంటూ ఓవరాక్షన్ చేసే అనుచరుడు ఫ్లాష్ అవుతాడు. అతనే ఈ వినాయకన్. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇతను కేవలం నటనకే పరిమితమైన సాధారణ ఆర్టిస్టు కాదు
ఇతని కెరీర్ 1995లో మొదలైంది. కేరళకు చెందినవాడు. మాంత్రికం సినిమాలో క్యామియోతో తెరంగేట్రం చేశాడు. కెరీర్ ప్రారంభంలో డాన్సర్ గా అవకాశాల కోసం వేట మొదలుపెట్టాడు. బ్లాక్ మెర్క్యూరీ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైకేల్ జాక్సన్ ని బాగా అనుకరిస్తాడని పేరు. ఎన్నో ఏళ్ళు చిన్న చిన్న వేషాలతో బండి నెట్టుకొచ్చాడు. ఓ రెండు హిందీ చిత్రాల్లో నటించినా పెద్దగా లాభం లేకపోయింది. 2006 కళ్యాణ్ రామ్ అసాధ్యుడులో నటించాడంటే గుర్తు తెచ్చుకోవడం కష్టం. అతి పెద్ద బ్రేక్ 2016 దుల్కర్ సల్మాన్ కమ్మటిపాదంతో దక్కింది. ఎన్నో అవార్డులు వరించాయి.
అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. జైలర్ లో విలన్ కోసం ముందు ఒక పెద్ద స్టార్ హీరోని మాట్లాడుకున్నారు. కానీ రజనీకాంత్ బాగా అలోచించి అలా అయితే చాలా పరిమితులు అడ్డం వస్తాయని వేరే ఆప్షన్ చూడమని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు సూచించారు. కట్ చేస్తే ఎవరూ ఊహించని పేరు వినాయకన్ తెరమీదకు వచ్చాడు. ట్రయిల్ షూట్ చేయడం, అది బ్రహ్మాండంగా రావడం, తలైవర్ ఎదురుగా సవాల్ విసిరే పాత్రను దక్కించుకోవడం చకచకా జరిగాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కోరుకున్న పెద్ద బ్రేక్ దొరికింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates