టాలీవుడ్లో టాప్ స్టార్ల మధ్య పోటీ ఉన్నట్లే.. అభిమానుల మధ్య కూడా ఉంటుంది. వాళ్లలో చాలామంది తమ హీరోలకు ఎలివేషన్ ఇచ్చుకోవడం కంటే.. అవతలి హీరోలను డీగ్రేడ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. సోషల్ మీడియా ఊపందుకున్నాక ఈ రకమైన ప్రచారాలు వికృత రూపం దాల్చిన మాట వాస్తవం. అదే పనిగా నెగెటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేయడం.. సినిమాను కిల్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంటుంది. సినిమాకు ఓ మోస్తరుగా నెగెటివ్ టాక్ వచ్చినా.. దాన్ని వరస్ట్ టాక్‌గా మార్చడానికి చూసే వాళ్లు చాలామందే ఉంటారు.
ఇందులో ఫలానా హీరో అభిమానులు ఎక్కువ, ఫలానా హీరో ఫ్యాన్స్ తక్కువ అని చెప్పడానికేమీ లేదు. ఐతే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ విషయంలో వచ్చిన నెగెటివిటీ మాత్రం అలాంటిలాంటిది కాదు. ఈ చిత్రం చిరు అభిమానులకే నచ్చలేదన్నది వాస్తవం. కానీ ఈ సినిమాను యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన తీరు మాత్రం దారుణం.
‘భోళా శంకర్’కు మినిమం ఓపెనింగ్స్ కూడా రాకపోవడానికి సోషల్ మీడియాలో జరిగిన తీవ్ర దుష్ప్రచారం ఒక కారణం. అదే పనిగా కొన్ని వర్గాలు ఈ సినిమాను టార్గెట్ చేశాయి. పనిగట్టుకుని నెగెటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేశాయి. ఇందుకు ‘భోళా శంకర్’ రిలీజ్ ముంగిట జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరు చేసిన రెండు కామెంట్లు కారణంగా భావిస్తున్నారు. ఈ వేడుకలో చిరు ప్రసంగాన్ని ఆరంభిస్తూనే ‘‘ఆ రోజుల్లో అని చెప్పుకోవడం నాకిష్టముండదు.
ఆ రోజుల్లో అన్నారు అంటే ఈ రోజుల్లో ఏమీ లేదు అని అర్థం’’ అని వ్యాఖ్యానించారు. చిరు యథాలాపంగానే ఈ మాట అని ఉండొచ్చు. ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయన కూడా తనకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అని కూడా అన్నారు. కానీ నందమూరి బాలకృష్ణ తరచుగా ఆ రోజుల్లో నాన్నగారు అనే మాటల్ని ఊతపదాల్లా వాడుతుంటారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ చిరు వ్యాఖ్యలకు అఫెండ్ అయినట్లు తెలుస్తోంది. వాళ్లు ‘భోళా శంకర్’ను కొంచెం గట్టిగానే టార్గెట్ చేశారు.
నందమూరి అనుకూల మీడియా, వెబ్ మీడియా సైతం ఈ సినిమాను లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు వైసీపీ వాళ్లు ట్రిగ్గర్ అయ్యేలా చేశాయి. చిరు కొంచెం మర్యాదగానే.. మంచి మాటలే చెప్పినా సరే.. వాటిని వైసీపీ వాళ్లు వేరేలా తీసుకుని చిరును.. ఆయన సినిమాను దారుణంగా టార్గెట్ చేశారు. మామూలుగా సినిమా మీద ఉన్న నెగెటివిటీకి తోడు.. ఈ వర్గాలు ఆ చిత్రాన్ని టార్గెట్ చేయడం వల్లే ఇంత దారుణమైన ఫలితం వచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.