భోళా శంకర్.. మెయింటైనెన్స్ కూడా కష్టమే

మెగాస్టార్ చిరంజీవికి ‘ఆచార్య’ను మించిన డిజాస్టర్ కెరీర్లో ఇంకెప్పటికీ రాదనే అంతా అనుకున్నారు. ‘భోళా శంకర్’ విషయంలో అంచనాలు తక్కువే అయినప్పటికీ.. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఓ మోస్తరుగా ఆడేస్తుందనే అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా ఘోరాతి ఘోరమైన ఫలితం దిశగా అడుగులు వేస్తోంది.

తొలి రోజే హౌస్ ఫుల్స్ లేక ఇబ్బంది పడ్డ ఈ చిత్రానికి.. బ్యాడ్ టాక్ కారణంగా రెండో రోజు మినిమం ఆక్యుపెన్సీలు కరవయ్యాయి. తొలి రోజు వచ్చిన వసూళ్లే తక్కువ అంటే.. రెండో రోజు 70 శాతం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శని, ఆదివారాల్లో చిరు సినిమా సాయంత్రం షోలకు సగం కూడా థియేటర్లు నిండని పరిస్థితి ఉందంటే ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టరో అంచనా వేయొచ్చు. వీకెండ్లోనే ఇలా ఉంటే.. తర్వాతి రోజుకు ఇంకెలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

సోమవారం ‘భోళా శంకర్’ బుకింగ్స్ ఓపెన్ చేస్తే పది టికెట్లు కూడా తెగని థియేటర్లు బోలెడు కనిపిస్తున్నాయి. బుక్ మై షోలు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. ఒక్క షో కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో లేదు. సోమవారం షోల ద్వారా వచ్చే వసూళ్లు థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోని పరిస్థితి. మంగళవారం ఇండిపెండెన్స్ డే సెలవు కాబట్టి పరిస్థితి కొంచెం మెరుగపడొచ్చు.

కానీ బుధవారం నుంచి మాత్రం ‘భోళా శంకర్’ మీద పూర్తిగా ఆశలు వదిలేయొచ్చు. మంగళవారంతోనే ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అని చెప్పొచ్చు. రూ.80 కోట్ల షేర్ సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఈ సినిమా అందులో మూడో వంతు షేర్ సాధిస్తే గొప్ప అన్నట్లుంది. భారీ డెఫిషిట్‌తో చాలా ఏరియాల్లో సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకున్న నిర్మాత అనిల్ సుంకరకు ‘ఏజెంట్’ తర్వాత మరోసారి భారీ నష్టాలు తప్పేలా లేవు.