Movie News

అభిమాని ఆవేదన అక్షర రూపం తీసుకుంటే

నటించిన హీరోకి, తీసిన దర్శక నిర్మాతలకు ఏమో కానీ భోళా శంకర్ డిజాస్టర్ మెగాభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ట్వీట్ల రూపంలో రకరకాలుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒక ఫ్యాన్ విడుదల రోజు షో అయ్యాక సోషల్ మీడియాలో చిరంజీవిని ఉద్దేశించి రాసిన ఓపెన్ లెటర్ వాళ్ళ ఆవేదనని అక్షరరూపంలో కళ్ళముందుంచుతోంది. ఇది మెగాస్టార్ దాకా చేరినా చేరకపోయినా సగటు ప్రేక్షకుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. సుదీర్ఘమైన ఆ ఉత్తరం తాలూకు ఆవేదన పూర్తి పాఠం ఇది.

ప్రియమైన భోళా అన్నయ్యకి

మీ శతకోటి అభిమానుల్లో ఒకడిగా ఇలా ఒక ఓపెన్ లెటర్ రాయాల్సి వస్తుందని ఊహించలేదు. ఇవాళ గంపెడాశలతో భోళా శంకర్ వెళ్ళా. నా జీవితంలో మొదటిసారి మీ సినిమా హౌస్ ఫుల్ అయినా ఈలలు కేకలు వినిపించకుండా చూసింది ఇదొక్కటే. క్లైమాక్స్ లో మీరు చివరి విలన్ ని చంపడానికి ముందే నేను లేచి థియేటర్ బయటికి వచ్చేస్తే పక్కనే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ ప్రదర్శించిన ఆశ్చర్యం ఇంకా నా కళ్ళముందు పచ్చిగానే ఉంది.

అసలేం జరుగుతోంది అన్నయ్య. ఎవరికో ఎప్పుడో ఇచ్చిన మాటల కోసం అవకాశాలిస్తారా. మీరు నటిస్తోంది టీవీ సీరియల్స్ లో కాదుగా. వంద కోట్ల పెట్టుబడులు పణంగా పెడుతున్న సినిమాల్లో. కథల జడ్జ్ మెంట్ లో ఎంతో నిక్కచ్చిగా ఉండే మీ లెక్క ఎక్కడ తప్పుతోంది. కాలం చెల్లిన నక్సలైట్ల కాన్సెప్ట్ ని పాదఘట్టంకి ముడిపెట్టి ఆచార్యతో మమ్మల్ని బాధ పడితే ఏదోలే అనుకుని వదిలేశాం. మరి తెలిసి భోళా శంకర్ కు ఒప్పుకున్న మీ భోళాతనానికి నష్టపోతున్నది మీరో ప్రొడ్యూసర్లో కాదు. ఆర్థికంగా మానసికంగా అభిమానులు.

మిమ్మల్ని నిలదీసే స్థాయి నాకుందాని కొందరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. నా స్కూల్ చెడ్డీల వయసు నుంచి నా కొడుక్కి ప్యాంట్లు తొడిగే ఏజ్ దాకా నా ప్రయాణంలో కొన్ని వందల వేల గంటలు, లక్షల రూపాయలు మీ సినిమాలకు ఖర్చు పెట్టాను. సో మీరు సంబోధించే తమ్ముడిగా నేను ఇలా అడగొచ్చు. దయచేసి మీ స్థాయి గుర్తించండి. కామెడీ స్కిట్లు చేసే పది మంది ఆర్టిస్టులు వచ్చి భజన చేస్తే వాళ్ళకు కలిసి భోజనం చేసే అదృష్టం కలిగించండి. అంతే కానీ బలవంతంగా లేని పాత్రలు సృష్టించి ఆఫర్లు ఇప్పించకండి

న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్, రైటర్స్ ని పిలిపించండి. మీకెప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం బ్లాక్ బస్టర్లు ఇచ్చారన్న కృతజ్ఞతతో ఇప్పటి ట్రెండ్ మీద అవగాహన లేని రచయితలను డైరెక్టర్లను దూరం పెట్టండి. లేదూ కథ రెడీ అయ్యాక మొహమాటం లేకుండా చెప్పే నాబోటి వెర్రి అభిమానులను పిలిపించి అడగండి. అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అంతే కానీ జేబు ఖర్చులకు తండ్రులు డబ్బులిస్తే తప్ప బయట తిరగలేని బచ్చాలకు ట్రోలింగ్ మెటీరియల్ కాకండి.

అలా అని ఆపద్బాంధవులు, రుద్రవీణలు తీయమని అడగను. అవి థియేటర్ లో ఎప్పుడు తీసినా ఆడవు. కమర్షియల్ కథలే కావాలంటే ఆడియన్స్ టేస్ట్ కి ఏం కావాలో చూడండి. దానికి తగ్గట్టే చేయండి. లేదంటే జనాలు సగం ఉడికిన ఆలూ కర్రీ లాంటి జైలర్లను నెత్తిన బెట్టుకుని కోట్లకు కోట్లు కలెక్షన్లు కుమ్మరించి మీ థియేటర్లను డెఫిషిట్లతో బయ్యర్లు భోరుమనేలా చేస్తారు. మళ్ళీ మళ్ళీ ఈ అనుభవం వద్దు. ఈ రోజు హాలులో ఉదయం 7 గంటలకు చాలా ఫ్యామిలీలు ఇంట్లో పొయ్యి వెలిగించకుండా సినిమాకు వచ్చాయి. అదీ మీ రేంజ్.

చెక్కుచెదరని సింహాసనం మీద మగమహారాజులా ఉన్న మీ కాలు కుర్చీలు కోసేందుకు కత్తులు అక్కర్లేదు. పొగడ్తలు చాలు. అవి మనకొద్దు అన్నయ్యా. ఎంత బాధ పడి ఉంటే ఇంత పెద్దగా రాస్తాను చెప్పు. నువ్వేం చేసినా ఆహా అనే రకం నేను కాదు. చెప్పులు తెగిపోతే కొత్తవి కొనుక్కోమని నాన్నకు చెబుతాను. అలాగే నీ కిరీటంపై వజ్రాలను దొంగలు ఎత్తుకుపోతుంటే హెచ్చరిక చేయకుండా ఎలా ఉంటాను. నీ దాకా చేరదని తెలిసి కూడా ఏదో చెప్పకుండా ఉండలేకపోయా. ఇంకా చాలా ఉంది కానీ మరీ ఇక్కడితో ఆపేద్దాంలే

ఇట్లు
ఓ అభిమాని

This post was last modified on August 14, 2023 12:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago