ప్రముఖ సినీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే, తన తండ్రి ఆరోగ్య స్థితిలో ఎటువంటి మార్పు లేదని, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని బాలు తనయుడు చరణ్ వీడియో సందేశం ద్వారా ఎప్పటికపుడు అప్డేట్స్ ఇస్తున్నారు. బాలు ఆరోగ్యం కుదుటపడాలని, కరోనాను జయించి తిరిగి రావాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలు త్వరగా కోలుకోవాలని, ఆయన కోసం కోట్లాది మంది ప్రాణాలు కొట్టుకుంటున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రార్థించారు. బాలు అన్నయ్య గళానికి నిశ్శబ్దంగా ఉండే హక్కు లేదన్న సిరివెన్నెల….త్వరలోనే వచ్చి కొత్త పల్లవి పాడాలని ట్విట్టర్ లో వీడియో సందేశం ద్వారా కోరారు.
ఒక్క ప్రాణం అక్కడ నలతగా ఉండి ఆయాస పడుతుంటే ఇక్కడ ఒక్కటి కాదు, వేలు, లక్షలుకాదు, కోట్లాది ప్రాణాలు కొట్టుకుంటున్నాయని సిరివెన్నెల అన్నారు. ఒక్క శ్వాసలో సరిగమలు అపశృతిని సరిచేసుకుంటుంటే నా దేశపు ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని తరాలుగా గాలి బాలు పాటగా, మాటగా వీస్తూనే ఉంది, విహరిస్తూనే ఉంది. ఇప్పుడెందుకో చిన్న వెంటిలేటర్ ఇరుకులో చిక్కుకుని విలవిల్లాడుతోందని బాధపడ్డారు సిరివెన్నెల. కొన్నాళ్లుగా ఆకాశం కంటికి మింటికి ఏకధారగా రోదించి, నిన్నటి నుంచే వెచ్చని సూర్యకిరణాలతో చెక్కిళ్లు తుడుచుకుని కాస్త తెరిపిటపడుతోందన్నారు సిరివెన్నెల.“అన్నయ్యా ఇకచాలు!.. ఇన్ని రోజుల నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే హక్కు ఆ గళానికి లేదు. త్వరగా కోలుకో. కొత్త పల్లవితో ప్రకృతికి ప్రాణగీతికలా చిగురించు” అంటూ తనదైన శైలిలో బాలు త్వరగా కోలుకోవాలని వీడియోలో భావోద్వేగభరితంగా వ్యాఖ్యానించారు సిరివెన్నెల. మ్యూజిక్ మేస్ట్రో ఇళయ రాజా, విశ్వ నటుడు కమల్ హాసన్, ప్రముఖ గాయకుడు మనోలతో పాటు పలువురు సినీ ప్రముఖులంతా బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన సంగతి తెలిసిందే.