బావ బావమరుదులుగా చిరంజీవి, అల్లు అరవింద్ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే జరిగిన భోళా శంకర్ ఈవెంట్ లో అరవింద్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ మీద అనవసర ఆరోపణలు చేసిన వాళ్లకు పదిహేను సంవత్సరాల పాటు పోరాడి శిక్ష వేయించే దాకా వదల్లేదని చిరు అంటే తనకంత అభిమానమని పబ్లిక్ గా చెప్పేశారు. అయితే ఈ ఇద్దరూ కలిసి గీతా ఆర్ట్స్ కోసం సినిమా చేసి ఏళ్ళు గడిచిపోయాయి. 2005లో వచ్చిన అందరివాడు ఆఖరిది. ఆ తర్వాత కొంత కాలానికే మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, అరవింద్ సైతం ప్రజారాజ్యం వెంటే ఉండటం గడిచిన చరిత్ర.
చిరు కంబ్యాక్ జరిగాక ఆయనకు సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ రామ్ చరణ్ చేతికి వెళ్లిపోయాయి. కొణిదెల బ్యానర్ ని స్థాపించి ఖైదీ నెంబర్ 150, సైరాలు నిర్మించి ఆచార్యకు భాగస్వామిగా ఉన్నాడు. కానీ తన ప్యాన్ ఇండియా సినిమాలకే ఇప్పుడు టైం లేకపోవడంతో క్రమంగా తండ్రి బయటి సంస్థలకు ఓకే చెబుతున్నా కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని సైడ్ అయ్యాడు. ఈ మొత్తం సీన్ లో అరవింద్ ఎక్కడా లేరు. 18 ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది. ఇంత సుదీర్ఘమైన సమయంలో ఎన్నోసార్లు కలుసుకున్నారు కానీ కలిసి ఏదైనా మూవీ చేసే దిశగా మాత్రం సంకేతాలు ఇవ్వలేదు.
ఇప్పుడు అల్లు అరవింద్ అనుభవం అవసరమవుతోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కథలను జడ్జ్ చేయడంలో, చిరుకు ఎలాంటివి సూటవుతాయో పసిగట్టడంలో ఆయనది తిరుగు లేని చేయి. పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మాస్టర్ ఇలా ఎన్నో సినిమాలు ఋజువు చేశాయి. గీతా ఆర్ట్స్ 2 పేరుతో బన్నీ వాస్ పార్ట్ నర్ షిప్ లో మరో సంస్థని ఏర్పాటు చేసి చిన్న సినిమాలతో బిజీగా ఉన్న అరవింద్ త్వరలో చిరుతో జట్టు కట్టడం అనుమానమే. ఎందుకంటే మెగాస్టార్ కొత్తగా ఒప్పుకున్న మూడు సినిమాలు అన్నీ ఇతర ప్రొడ్యూసర్లతోనే. మరి గీతతో ఎప్పుడు సాధ్యమయ్యేనో.
Gulte Telugu Telugu Political and Movie News Updates