జైలర్ విజయంలో స్పెషల్ క్యామియోలు ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పంచెకట్టుతో కేవలం అయిదు నుంచి పది నిమిషాల మధ్యే కనిపించినా దాని ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల్లో బలంగా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోయింది. కర్ణాటక రాష్ట్రం మాండ్య పట్టణంలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసే పవర్ ఫుల్ నరసింహా క్యారెక్టర్ లో ఆయనకు చాలా తక్కువ డైలాగులు పెట్టారు . చివరి సీన్ లో కేవలం చుట్ట వెలిగించి థియేటర్లను షేక్ చేశారు. నిజానికి శాండల్ వుడ్ లో ఈయనో పెద్ద స్టార్.
కానీ బయట రాష్ట్రాల వాళ్లకు తెలిసింది తక్కువ. అందుకే శివరాజ్ కుమార్ పాత సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ వెతుకులాట మొదలుపెట్టారు. వాళ్లకు కొన్ని షాకింగ్ సంగతులు తెలుస్తున్నాయి. ఇండియాలోనే అయిదు వందలసార్లకు పైగా రీ రిలీజ్ జరుపుకున్న ఓం హీరో ఈయనే. దీన్నే తెలుగులో రాజశేఖర్ తో రీమేక్ చేశారు. దర్శకుడిగా ఉపేంద్ర సత్తా ప్రపంచానికి తెలిసింది ఈ బ్లాక్ బస్టర్ తోనే. ప్రభాస్ ఏరికోరి ముచ్చటపడి నటించిన యోగి ఒరిజినల్ వెర్షన్ జోగి కథానాయకుడు శివరాజ్ కుమారే. ఇప్పటికీ దాని పేరు మీద రికార్డులు అక్కడ భద్రంగా ఉన్నాయి.
బాలకృష్ణతో శివరాజ్ కుమార్ తో చాలా స్నేహం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణిలో అడగ్గానే బుర్రకథ పాటలో నటించానికి ఒప్పుకుని పారితోషికం తీసుకోకుండా చేశారు. ఇప్పుడీ జైలర్ వల్ల ఆయన్ను దృష్టిలో పెట్టుకుని క్యామియోలు రాస్తున్న దర్శకులు ఉన్నారట. వీరసింహారెడ్డిలో బాలయ్య పంచె గెటప్ ని శివరాజ్ కుమార్ మఫ్టీలో నుంచి తీసుకునే స్ఫూర్తి చెందామని బాలయ్య ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్ని నిముషాలు కనిపించాం అన్నది కాదు ఆడియన్స్ కి ఎంతలా గుర్తుండిపోయామన్నది ముఖ్యమనే పోకిరి పండులా నరసింహ నిలిచిపోయేలా ఉన్నాడు. అన్నట్టు ఇంత చర్చ మోహన్ లాల్ గురించి జరగకపోవడం ఫైనల్ ట్విస్టు.