ఎన్నో నెలల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సందడి గదర్ 2తోనే కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాదిలోని సింగల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో పోటెత్తాయి.నిన్న ఒక్క రోజే 40 కోట్ల దాకా వసూలైందని ముంబై ట్రేడ్ పండితుల లెక్క. పఠాన్ తర్వాత ఈ ఏడాది ఆ స్థాయి ఫిగర్లు దీనికే నమోదు కావొచ్చని అంటున్నారు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొనసాగింపుకి ఇంత స్పందన రావడం చూసి దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2ని సైడ్ చేసిన గదర్ 2 నిజంగా ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పించేలా ఉందా.
1971 కథ కొనసాగుతుంది. మొదటి భాగం క్లైమాక్స్ లో తారా సింగ్(సన్నీ డియోల్), సకీనా(అమీషా పటేల్)ఇండియా వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోతారు. వాళ్ళను ఆపలేదన్న దుగ్దతో ఉన్న అష్రాఫ్ అలీ(అమ్రిష్ పూరి)ఉరి తీయబడి ఉంటాడు. ఈ జంట సంతానం చరణ్ జీత్ (ఉత్కష్ శర్మ)కు హీరో కావాలని కోరిక. ఓసారి భారతదేశ సైన్యానికి సహాయం చేయడానికి వెళ్లిన తారా సింగ్ పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడతాడు. తండ్రి కోసం రహస్యంగా వెళ్లిన చరణ్ అక్కడో అమ్మాయిని ప్రేమించి దొరికిపోతాడు. ఇక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. వీళ్ళిద్దరూ ముష్కరుల నుంచి తప్పించుకోవడమే స్టోరీ.
గదర్ వీరాభిమానులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు అనిల్ శర్మ దీన్ని తీసినప్పటికి నెరేషన్ స్టయిల్ మాత్రం ఆ కాలందే ఫాలో కావడంతో టేకింగ్ మొత్తం పాత చింతకాయపచ్చడిని తలపిస్తుంది. ఎమోషన్లన్నీ తారా చరణ్ ల చుట్టే తిప్పడంతో సకీనా డమ్మీ అయిపోయింది. బడ్జెట్ మరీ కళ్ళు చెదిరేలా ఖర్చుపెట్టలేదు కానీ ఉన్నంతలో సన్నీ డియోల్ మార్కెట్ ని మించే పెట్టారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బలంగా నిలిచింది. రీమిక్స్ చేసిన పాటలు తప్ప మిగిలిన సాంగ్స్ సోసోనే. ఒకప్పటి క్లాసిక్ కి డై హార్డ్ ఫ్యాన్స్ అయితే గదర్ 2 మీద ఓ లుక్ వేయొచ్చు కానీ ఇంకేదో ఆశించే కొత్త ఆడియన్స్ కి కనెక్ట్ కావడం కొంచెం కష్టమే.