పేరుకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చిన్న సినిమాలతో తన ఉనికిని చాటుకోవడానికి చూస్తున్న హీరో శ్రీసింహ కోడూరి. మత్తు వదలరా తప్ప ఇతనికి చెప్పుకోదగ్గ హిట్టు లేదు. తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త దారుణంగా దెబ్బ కొట్టాయి. ఇటీవలే భాగ్ సాలేకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. కీరవాణి అబ్బాయనే పేరే కానీ కుర్రాడు ఇంకా మొదటి మెట్టు దగ్గర ఉన్న మాట వాస్తవం. ఇతని కొత్త చిత్రం ఉస్తాద్ ఈ ఆగస్ట్ 12 శనివారం రిలీజ్ కు రెడీ అయ్యింది. హడావిడి లేకపోయే సరికి అందరూ వాయిదా పడిందేమో అనుకున్నారు.
కానీ అలాంటిదేమీ లేదు. చెప్పిన డేట్ కే ఉస్తాద్ ని వదులుతున్నారు. ఒకపక్క రజనీకాంత్ జైలర్ మీద చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత తలైవర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు భోళా శంకర్ కు చిరంజీవి రేంజ్ సందడి లేకపోయినా మౌత్ టాక్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందనే నమ్మకంతో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు టీమ్ మొత్తం ఉంది. యావరేజ్ అనిపించుకున్నా చాలు మాస్ అండతో మెగాస్టార్ గట్టెక్కేస్తారు. ఈ రెండు దిగ్గజాల మధ్య చిన్న కుర్రాడు శ్రీసింహని దింపుతున్నారు.
ట్రైలర్ వగైరాలు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ ఉస్తాద్ కు ఇది సరైన సమయం కాదేమోనని బయ్యర్ల మాట. ఎందుకంటే సరిపడా థియేటర్లు అందుబాటులో లేవు. నిర్మాత సాయి కొర్రపాటి తన నెట్ వర్క్ తో స్క్రీన్లు ఇప్పించినా అసలంటూ జనం రావాలిగా. అది జరగాలంటే ప్రమోషన్లలో స్పీడ్ పెంచాలి. పోనీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే రాజమౌళిని తీసుకొచ్చి ఏదైనా ఈవెంట్ లాంటిది చేస్తేనైనా బాగుండేది. కానీ ఇప్పటికైతే ఆ సూచనలు లేవు. ఫణిదీప్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ లో బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. ఇంతరిస్క్ చేశారంటే కంటెంట్ అంత బలంగా ఉందేమో.