మెగాస్టార్ చిరంజీవి మామూలుగా ఎంత మొహమాటస్థుడో.. సున్నిత మనస్కుడో తెలిసిందే. ఆయన నొప్పించక తానొవ్వక అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఎవరినీ ఘాటుగా విమర్శించలేరు. ఎవరి గురించీ పరుషంగా మాట్లాడలేరు. ఈ లక్షణాల వల్లే రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాజకీయాలకు టాటా చెప్పాక చిరు మరింత సున్నితంగా మారిపోయారు.
అవసరం లేని చోట కూడా అతి మర్యాదను పాటిస్తూ వస్తున్నారు. ఓవైపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నీచంగా మాట్లాడే నేతలను కూడా గౌరవిస్తూనే వచ్చారు. ఓవైపు పవన్‌ను టార్గెట్ చేస్తూ సినిమా టికెట్ల రేట్లు తగ్గించి మొత్తం ఫిలిం ఇండస్ట్రీని జగన్ సర్కారు ఇబ్బంది పెడుతుంటే.. చిరు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. పైగా ఏపీ సర్కారు చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. జగన్ ముందు చేతులు జోడించి మరీ వేడుకుని సమస్యను పరిష్కరించారు.
జగన్‌తో శతృత్వం మంచిది కాదన్న ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలకడంతో పాటు పలు సందర్భాల్లో జగన్ పట్ల కొంచెం విధేయంగా ఉంటూ సానుకూలంగానే మాట్లాడుతూ వచ్చారు. అలాంటి చిరు ఇప్పుడు ఉన్నట్లుండి జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా మాట్లాడ్డం అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరు తీరు చూస్తే ఇక ఎప్పటికీ జగన్‌నే కాదు.. ఏ రాజకీయ నాయకుడిని, పార్టీనీ కూడా విమర్శించలేరనే అంతా అనుకున్నారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉంటూ, తటస్థుడిగానే వ్యవహరించేలా కనిపించారు.
కానీ ఇప్పుడు ఆయన స్వరం మారిపోయింది. ఏపీలో పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించాకే చిరులో ఒక ధైర్యం వచ్చి ఇలా విమర్శలు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదంటే ఏదైతే అయింది జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తన తమ్ముడికి బాసటగా నిలవాలని.. మెగా అభిమానులందరినీ వైసీపీకి వ్యతిరేకంగా, జనసేనకు మద్దతుగా ఏకతాటిపైకి తీసుకురావాలని కూడా ఆయన భావించి ఉండొచ్చు. ఏదేమైనా చిరు వ్యాఖ్యలైతే రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates