మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘భోళా శంకర్’కు తెలుగు రాష్ట్రాల్లోనే ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చిరు గత చిత్రాలతో పోలిస్తే చాలా డల్లుగా నడుస్తున్నాయి. ‘ఆచార్య’ ఎంత నిరాశపరిచినప్పటికీ.. దాని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇంత నెమ్మదిగా అయితే లేవు. హైదరాబాద్ లాంటి చోట కూడా ఈ సినిమా షోలు ఒకటీ అరా తప్ప సోల్డ్ ఔట్ చూపించట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక యుఎస్‌లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని షోలకు టికెట్లు పదుల సంఖ్యలోనే తెగాయి. ఎక్కడా టికెట్ల అమ్మకాలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో లేవు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రిమియర్స్ నుంచే 7 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టిన చిరు.. ‘భోళా శంకర్’తో అందులో సగం కలెక్షన్లు రాబట్టడం కష్టంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు తక్కువ స్థాయిలో ఉండబోతున్నాయన్నది స్పష్టం.
‘వాల్తేరు వీరయ్య’తో రూ.135 కోట్ల షేర్ రాబట్టిన చిరుకు ‘భోళా శంకర్’తో రూ.100 కోట్ల షేర్ తెచ్చి బ్రేక్ ఈవెన్ చేయడం కూడా చాలా పెద్ద సవాల్‌లాగే కనిపిస్తోంది. ఐతే దీన్ని బట్టి చిరు రేంజ్ పడిపోయిందని.. ఆయన కెపాసిటీని తక్కువ అంచనా వేయడం మాత్రం కరెక్ట్ కాదు. కొందరు యాంటీ ఫ్యాన్స్ ఇదే ఛాన్స్ అని.. ‘భోళా శంకర్’కు సంబంధించిన నెగెటివ్ విషయాలన్నీ చూపించి చిరును ట్రోల్ చేయాలని చూస్తున్నారు.
ఒక రీమేక్.. పైగా రొటీన్ మాస్ సినిమా.. ‘శక్తి’, ‘షాడో’ లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం.. ఇలాంటి నేపథ్యంలో వస్తున్న ‘భోళా శంకర్’ను చూసి చిరు కెపాసిటీని అంచనా వేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఇంత నెగెటివిటీ ఉన్న సినిమాను యావరేజ్ స్థాయిలో నిలబెట్టినా కూడా చిరు గ్రేట్ అనిపించుకుంటాడు. అంతే తప్ప దీని వసూళ్ల లెక్కల్ని చూపించి చిరును తక్కువ అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు.