టికెట్ రేట్ల పెంపు అత్యాశా ఆత్మవిశ్వాసమా

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చిరంజీవి భోళా శంకర్ టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీలో విజ్ఞప్తి చేశారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 25 రూపాయల హైక్ కోసం అప్లికేషన్ పెట్టారని, ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు అనుమతులు జారీ చేస్తూ జీవో వస్తుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. అసలే బజ్ లేదు. నాలుగు పాటలు బయటికి వచ్చినా ఏదీ ఛార్ట్ బస్టర్ అనిపించుకోలేదు. మ్యూజిక్ పెద్ద హిట్టయ్యిందని టీమ్ సంబరపడటమే కానీ వాస్తవానికి బయట జరుగుతున్నది వేరు. ట్విట్టర్ చూసినా వాస్తవం అవగతమవుతుంది.

ఇలాంటి ప్రతికూల వాతావరణంలో టికెట్ రేట్ పెంపుకు వెళ్లడం వెనుక మతలబు ఏంటనే డౌట్ రావడం సహజం. తెలంగాణలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా మల్టీప్లెక్సులు టికెట్ ధరని 295 రూపాయలు పెట్టుకునే వెసులుబాటు ఉంది. కానీ ఏపీలో ఇది 177 రూపాయలకే పరిమితం. దాని వల్లే ఓ పాతిక పెంచుకోవటానికి ఛాన్స్ ఇస్తే బయ్యర్లకు రికవరీ సులభమవుతుంది నిర్మాత అనిల్ సుంకర ఆలోచన. సింగల్ స్క్రీన్లలోనూ అంతే. నైజామ్ లో 175 దాకా ఉంటే ఆంధ్రలో 148 కంటే దాటే ఛాన్స్ లేదు. అందుకే ఎగ్జిబిటర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇక్కడో చిక్కు ఉంది. భోళా శంకర్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. కానీ యావరేజ్ లేదా అంతకన్నా కింది ఫలితం వస్తే అప్పుడు పడే దెబ్బ మాములుగా ఉండదు. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మెగా మూవీనే వెనుకబడి ఉంది. జైలర్ మంచి స్వింగ్ లో ఉండగా గదర్ 2, ఓ మై గాడ్ 2లు కూడా మెల్లగా ఊపందుకుంటున్నాయి. మరి మెగా టీమ్ వెనుక ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే బాగానే ఉంది కానీ ఎటొచ్చి ఫ్యాన్స్ లోనే ఇంకా సరైన జోష్ కనిపించడం లేదు. బెనిఫిట్ షోల సమయాలు వాటి ముచ్చట్లు, టికెట్ల ఏర్పాట్లు ఇవేవి సీరియస్ గా చర్చించుకోవడం లేదు. ఈ నాలుగు రోజుల్లో అనూహ్య మార్పు ఉంటుందేమో.