నాని సినిమాకు అంత సత్తా ఉందా?

ఐదు నెలలకు పైగా ఇండియాలో థియేటర్లు మూత పడి ఉన్నాయి. విదేశాల్లో సైతం చాలా చోట్ల థియేటర్లకు మోక్షం లేకుండా చేసింది కరోనా. దీంతో కొత్త సినిమాల్ని ఎంతో కాలం ఆపి ఉంచలేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నేరుగా రిలీజ్ చేసేస్తున్నారు.

బాలీవుడ్లో అయితే అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీల్లో నేరుగా రిలీజైపోతున్నాయి. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమే కొంచెం వెనుకబడి ఉంది. ఇక్కడ చిన్నా చితకా సినిమాలే ఓటీటీల్లోకి వచ్చాయి.

ఐతే భవిష్యత్ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించకపోవడంతో ఎట్టకేలకు టాలీవుడ్ నిర్మాతల ఆలోచన మారింది. థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్న మీడియం రేంజ్ సినిమాల్ని కూడా ఓటీటీల్లో నేరుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ముందుగా అగ్ర నిర్మాత దిల్ రాజు ధైర్యం చేసి తన ‘వి’ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. రూ.32 కోట్లకు ఈ డీల్ తెగిందంటున్నారు. సెప్టెంబరు తొలి వారంలో ఈ చిత్రం ప్రైంలోకి వస్తుందంటున్నారు. నాని-సుధీర్ బాబు కాంబినేషన్లో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన చిత్రమిది. సినిమాకు మంచి క్రేజ్ ఉంది. టాక్ బాగుంటే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేదేమో. ఆ తర్వాత డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మితే ఇంకో 10 కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం వచ్చేది. అందుకే ఓటీటీల్లో రిలీజ్ చేసి ఆదాయాన్ని దెబ్బ తీసుకోవడం ఎందుకని రాజు ఆగాడు. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో సినిమాను ఓటీటీకి ఇచ్చేశాడు.

ఐతే ఇలా ఓటీటీల్లో వదిలేసినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ మీద రాజు ఆశలు వదులుకోవట్లేదట. ఆపై థియేటర్లు తెరుచుకున్నాక సినిమాను అక్కడా వదలబోతున్నారట. అలాగే కాస్త ముందు వెనుకగా విదేశాల్లోనూ రిలీజ్ చేస్తారట. ఐతే ఓటీటీల్లోకి వదిలేశాక థియేటర్లలోనూ ఆడేంత సత్తా ‘వి’కి ఉందా అన్నది సందేహం. కానీ ఎంత వస్తే అంత రానీ అని.. అలా కూడా సినిమాను రిలీజ్ చేయాలన్నది రాజు ప్లాన్. ఈ ప్రకారమే ప్రైమ్ వాళ్లతో డీల్ జరిగినట్లు తెలుస్తోంది.