హఠాత్తుగా విధించిన లాక్ డౌన్ వల్ల వలస కూలీలు, కార్మికుల జీవితాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంలో బాలీవుడ్ విలన్ సోనూసూద్ తో పాటు పలువురు సెలబ్రిటీలు, సినీతారలు, సామాన్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సాయం చేశాయి. అయితే, వీరందరిలోకి సోనూసూద్ ఎక్కువమందికి సాయం చేశాడనడంలో ఎటువంటి సందేహంలేదు. ఎందరినో ఆదుకున్న ఈ బాలీవుడ్ విలన్ ఒక్కసారిగా రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. ఎందరికో సాయం చేసిన సోనూసూద్ పై చాలామంది సెలబ్రిటీలు, పొలిటిషియన్లు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తాజాగా సోనూసూద్ పై టాలీవుడ్ లెజెండరీ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ ఆరిపోయే జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడని, అయితే, తాను కూడా చాలామందికి సాయం చేసినా పబ్లిసిటీ చేసుకోలేదని అన్నారు బ్రహ్మానందం.
సోనూసూద్ కూడా వలస వచ్చినవాడేనని, అందుకే, తన శక్తి కొలదీ వలస ఆదుకున్నారని బ్రహ్మి అన్నారు. అయితే, తాను కూడా ఈ మధ్య కాలంలో చాలామందికి సాయం చేశానని, కానీ, ఆ సాయానికి ప్రూఫ్‌లు, ఫొటోలు తీయించుకోలేదని అన్నారు. అదొక్కటే తాను చేసిన తప్పు.. ఒప్పు అని వేదాంత ధోరణిలో మాట్లాడారు బ్రహ్మి. సోనూసూద్ ఒక సూర్యుడు వంటి వాడైతే…తాను మిణుగురు పురుగు లాంటి వాడినని, తన కాంతి తనదేనని అన్నారు. తాను డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటానని కామెంట్స్ చేస్తుంటారని, అది నిజమేనని చెప్పారు బ్రహ్మి. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకుంటే వేరెవరి సాయం కోసమో ఎదురు చూడాలని, అది దు:ఖానికి హేతువని వేదాంత ధోరణిలో మాట్లాడారు బ్రహ్మి.
తినడానికి తిండి ఉంటే చిన్న గూడు, తిరగడానికి ఒక కారు కొనుక్కోమని తన మిత్రులకు సలహా ఇస్తుంటానని చెప్పుకొచ్చారు. ఓ సీనియర్ కెమెరామెన్ అద్దె కట్టలేదని ఇంటి ఓనర్ సామాన్లు బయటపడేశాడని, ఆయనకు సాయం చేశానని, ఈలోకంలో ఎవడూ ఎవడికి దానం చేయడని అన్నారు బ్రహ్మి.ఏదైనా ఒక టైం వరకే నడుస్తుందని, ఓ దశ దాటితే ఎవరైనా పక్కకు వెళ్లాల్సిందేనని తన సినిమా ఆఫర్లనుద్దేశించి అన్నారు. ఆకలితో ఉన్నప్పుడు భోజనం చేశానని, చాల్లేరా బాబూ అనుకున్నప్పుడు భోజనం చేశానని చెప్పుకొచ్చారు బ్రహ్మి. ఇప్పుడు సరైన ఆహారం దొరికినప్పుడు మాత్రమే భోజనం చేయాలని అనుకుంటున్నానని, తనకు సరైన ఆఫర్లు వస్తే నటిస్తానని అంటున్నారు బ్రహ్మానందం.