వివాదాస్పద వీడియో చుట్టూ శివుడి సినిమా  

పేరుకి దేవుడి కాన్సెప్ట్ తో రూపొందుతున్నప్పటికీ సెన్సార్ అధికారుల నుంచి ఏకంగా 27 కత్తెరింపులు, మార్పులతో పాటు పెద్దలకు మాత్రమే సర్టిఫికెట్ అందుకున్న ఓ మై గాడ్ 2 ఈ నెల 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాజీపడటం ఇష్టం లేని దర్శక నిర్మాతలు ఫైనల్ గా ఏ ముద్రకే మొగ్గు చూపారు. అంత కాంట్రావర్సియల్ కంటెంట్ ఇందులో ఏముందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం సహజం. దానికి కొంత జవాబు ఇచ్చే ప్రయత్నం ట్రైలర్ ద్వారా చేశారు. అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన ఈ సోషియో థ్రిల్లర్ కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు.

కథేంటో గుట్టు విప్పేశారు. కాంతి శరన్(పంకజ్ త్రిపాఠి) పుణ్యక్షేతంలో జీవించే పరమ శివభక్తుడు. టీనేజ్ కొచ్చిన కొడుకుని ఉన్నత చదువుల కోసం ఓ పెద్ద స్కూల్ లో చేరుస్తాడు. అయితే అనుకోకుండా ఒక అసభ్య వీడియో ద్వారా వాడు వైరల్ కావడంతో కాంతి పరువు బజారున పడుతుంది. నమ్ముకున్న నీలకంఠుడు ఇలా చేశాడేంటని కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఈలోగా శివుడు పంపిన దూతగా ఓ శక్తి స్వరూపం(అక్షయ్ కుమార్) మనిషిగా వచ్చి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అసలు జరిగిందేంటి, కాంతి శరన్ ఈ చక్రబంధంలో ఎందుకు  ఇరుక్కుపోవాల్సి వచ్చిందనేది స్టోరీ.

అసలు పాయింట్ ఒక వైరల్ వీడియో చుట్టూ తిరిగినట్టు అర్థమైపోయింది. వివాదం కూడా దాని మీదే వచ్చి ఉండాలి. సనాతన ధర్మం గొప్పదనంతో పాటు మత మార్పిడుల గురించిన ప్రస్తావన డైలాగుల రూపంలో చెప్పించారు. పంకజ్ త్రిపాఠి చాలా రోజుల తర్వాత తెరమీద వన్ మ్యాన్ షో చేశాడు. అక్షయ్ కుమార్ పాత్ర పరిమితంగా ఉన్నా శివుడి రాయబారిగా డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. గదర్ 2తో పోటీ పడుతున్న ఓ మై గాడ్ 2 మొత్తానికి అంచనాలు పెంచింది. ఫస్ట్ పార్ట్ ని పవన్ కళ్యాణ్ వెంకటేష్ లతో గోపాల గోపాలగా రీమేక్ చేశారు. ఇప్పుడీ సీక్వెల్ హిట్ అయితే తెలుగులోనూ రావొచ్చేమో.