పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ పోషించిన శ్యాంబాబు పాత్ర రాజకీయంగా పెద్ద చర్చకే తెర తీసింది. ఆ పాత్ర వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. చిత్ర బృందం ఈ ప్రచారాన్ని ఖండించినా కూడా ప్రేక్షకులైతే అది అంబటిని టార్గెట్ చేస్తూ పెట్టిన పాత్ర అని ఫిక్సయిపోయారు. అంబటి కూడా మొదట ఈ క్యారెక్టర్ విషయంలో కొంచెం సరదాగా, వ్యంగ్యంగానే స్పందించారు.
కానీ తర్వాత ఆయన మనసు మారినట్లుంది. తాజాగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రో టీంతో పాటు పవన్ కళ్యాణ్‌ను కొంచెం గట్టిగానే టార్గెట్ చేశారు. బ్రో సినిమా డిజాస్టర్ అంటూ ఈ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రెస్ మీట్లో ఆయన చదవడం అందరికీ పెద్ద షాకే. ఒక మంత్రిగా ఉంటూ ఇదేం పని అంటూ సోషల్ మీడియా జనాలు ఆశ్చర్యపోయారు.
అంతటితో ఆగకుండా మరోసారి పవన్ వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూ తాము కూడా కథలు రాసి.. సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించారు అంబటి. నిత్య పెళ్లికొడుకు, తాళి ఎగతాళి.. ఇలా పలు టైటిళ్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటూ వాటి డిజైన్లను కూడా ప్రెస్ మీట్లో అంబటి ప్రదర్శించడం విశేషం. మరోవైపు తనను టార్గెట్ చేస్తూ మరోసారి ఇలాంటి పాత్రలు సృష్టిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన బ్రో స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్.. పవన్ మిత్రుడు అయిన త్రివిక్రమ్ పేరు కూడా ఉపయోగించారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి త్రివిక్రమ్ లాంటి రచయితలైనా.. వేరే నటులైనా, దర్శకులైనా, నిర్మాతలైనా.. ఇంకోసారి ఇలాంటి పాత్రలు క్రియేట్ చేసి తనను టార్గెట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates