అలియా కన్నా కియారా క్రేజే ఎక్కువ

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ స్టార్ డం దేదీప్యమాన్యంగా వెలిగిపోతోంది. గత ఏడాది ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ కటియావాడి లాంటి బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకోవడంతో టాప్ మోస్ట్ డిమాండ్ తో  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొంటోంది. అయితే తన కంటే కియారా అద్వానీకి క్రేజ్ ఎక్కువా అంటే విశ్లేషకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఎల్లుండి విడుదల కాబోతున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానికి ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయిన మల్టీప్లెక్స్ టికెట్లు కేవలం 17 వేలే. ఇంకో రెండు రోజులు టైం ఉంది కాబట్టి దీనికి రెట్టింపు కావొచ్చు కానీ పాజిటివ్ టాక్ వస్తేనే పికప్ అవుతుంది.

కొన్ని వారాల క్రితం రిలీజైన కియారా అద్వానీ సత్యప్రేమ్ కి కథకు ముందు రోజు వరకు జరిగిన ముందస్తు అమ్మకాలు 55 వేల టికెట్లు. పైగా పెద్ద స్టార్ హీరోతో జోడి కట్టింది కాదు. కార్తీక్ ఆర్యన్ తో నటించినా ఆ స్థాయి రెస్పాన్స్ దక్కింది. మరి కరణ్ జోహార్ లాంటి టాప్ బ్రాండెడ్ డైరెక్టర్, రణ్వీర్ సింగ్ లాంటి హీరో, నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ ఇంత ఉన్నా కూడా ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వీటికి తోడు ఢిల్లీ లాంటి నగరాల్లో వర్షాలు వరదలు ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని ఇంకాస్త తగ్గిస్తున్నాయి. అలియా రణ్వీర్ జంట మేజిక్ చేయలేకపోతోంది

స్లో కిల్లర్ గా దూసుకెళ్తున్న కియారా అద్వానీ కెరీర్ ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటోంది. రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ ద్వారా మళ్ళీ ఇక్కడ అవకాశాలు పట్టాలని చూస్తోంది. ఎన్టీఆర్ దేవరకు ముందు తననే అనుకున్నారు కానీ కాల్ షీట్ల సమస్య వల్ల చేయలేకపోయింది. దీంతో ఆ ఆఫర్ కాస్తా జాన్వీ కపూర్ కు వెళ్లిపోయింది. మూడు ముళ్ళు పడ్డాక కూడా కియారా అవకాశాలకు లోటేమీ రాలేదు. ఇక అలియా భట్ మాత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ఏదో షారుఖ్ ఖాన్ దిల్ తో పాగల్ హై రేంజ్ లో హిట్టవుతుందని నమ్మకం పెట్టుకుంది. అది నిలబడుతుందో లేదో 28న తేలిపోతుంది.