ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకులను పలకరించబోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘బ్రో’. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అతడి చుట్టూ తిరిగే కథ. సెకండ్ లీడ్ రోల్ పవన్‌ది అని చెప్పొచ్చు. ఈ సినిమా తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే ఈ చిత్రాన్ని రూపొందించాడు.
తమిళంలో అతను చేసిన పాత్రనే తెలుగులో పవన్ చేశాడు. తమిళంతో పోలిస్తే కథలో మార్పులు చేర్పులు జరిగాయి. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమాను మలిచినట్లు కనిపిస్తోంది. తమిళంలో అయితే సినిమా కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు. అందుక్కారణం స్టార్ కాస్ట్ లేకపోవడం.. సినిమా మరీ క్లాస్‌గా నడవడం.. కమర్షియల్ అంశాలు తక్కువ కావడమే. తెలుగులో ఆ మైనస్‌లు అన్నీ కవర్ అయినట్లే కనిపిస్తోంది.
2023లో రిలీజవుతున్న ‘బ్రో’ సినిమాకు 17 ఏళ్ల కిందట పునాది పడినట్లు సముద్రఖని మీడియా మీట్‌లో వెల్లడించడం విశేషం. సముద్రఖని లెజెండరీ డైరెక్టర్ బాలచందర్‌కు శిష్యుడు. అతను దర్శకుడు కావడానికి ముందు తన గురువుతో కలిసి ఒక నాటకం చూశాడట. నాటకం అయ్యాక ఎలా ఉంది అని బాలచందర్ అడిగితే.. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. జనాలకు రీచ్ కావాలంటే మార్పులు చేర్పులు చేయాలి అని సముద్రఖని అభిప్రాయపడ్డాడు.
అప్పుడు నాటక రచయితతో మాట్లాడి ఆ కథను సముద్రఖనికి ఇప్పించాడట. దీన్ని నువ్వు అనుకున్నట్లు మార్చి సినిమాగా తీయి అని బాలచందర్ సూచించగా.. చాలా విరామం తర్వాత ఆ పాయింట్ మీద వర్క్ చేసి ‘వినోదియ సిత్తం’ తీసినట్లు సముద్రఖని వెల్లడించాడు. తమిళంలో సమయానికి సరైన నటుడు దొరక్క తానే ఆ పాత్ర చేశానని.. తెలుగులో పవన్ ఆ క్యారెక్టర్ చేయడం.. కథ కూడా మరింత ఆకర్షణీయంగా మారడంతో ఈ సినిమా పరిపూర్ణం అయిందని సముద్రఖని తెలిపాడు.