నాగార్జున నిర్ణయాలు ఎందుకు లేటవుతున్నాయి

సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయాయి. నాగార్జున కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్న మళయాలం రీమేక్ ఎట్టకేలకు అటక ఎక్కేసినట్టే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరూ నోరు మెదపడం లేదు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతికి ఓకే చెప్పారన్న వార్త లీకయ్యింది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం రిలీజ్ కావాలని ఎదురు చూస్తున్నారో లేక దాని  దర్శకుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని ఆగారో ఫ్యాన్స్ కి అంతు చిక్కడం లేదు.

ఈలోగా బిగ్ బాస్ సీజన్ 7 కోసం నాగ్ రెడీ అవుతున్నాడు. కంటెస్టెంట్ లిస్టు దాదాపుగా రెడీ అయిపోయింది. అగ్రిమెంట్లు అవ్వగానే పేర్లు బయటికి వస్తాయి. ఈలోగా ఇప్పటిదాకా ఆరు టైటిల్స్ గెలిచిన విజేతలను తీసుకొచ్చి కర్టెన్ రైజర్ ప్రోగ్రాం షూట్ చేసేశారు. కాస్త డిఫరెంట్ గా నాగ్ ఈసారి లుక్ మార్చేశారు. రఫ్ గెడ్డంతో కొత్తగా కనిపించబోతున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇది కాదు. వీకెండ్ లో రెండు ఎపిసోడ్లు వచ్చి పోయే రియాలిటీ షో వల్ల వాళ్లకు కిక్ రాదు. తెరమీద శివ, బంగార్రాజు లాగా మంచి మాసాల ఎంటర్ టైనర్ తో రావాలని కోరుకుంటున్నారు.

తన వ్యక్తిగత కెరీర్ తో పాటు నాగచైతన్య, అఖిల్ లు వరసగా ఫ్లాపులు చవి చూస్తుండటం అక్కినేని ఫ్యామిలీని కొంత డిఫెన్స్ లో పడేసింది. అందుకే ఈ ముగ్గురు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చైతు ఆల్రెడీ చందూ మొండేటితో ప్యాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడు. అఖిల్ యువికి చేయాల్సిన మూవీ కోసం స్క్రిప్ట్ ని మరోసారి చెక్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇక నాగార్జున ఆగస్ట్ నుంచి కొత్త మూవీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. ఈసారి ఎంత లేట్ అయినా సరే మెప్పించే కంటెంట్ తోనే రావాలని డిసైడ్ కావడంతో విపరీతమైన జాప్యం తప్పడం లేదు.