బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తన కెరీర్ 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 28న విడుదల చేస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని మీద ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడం బయ్యర్లను ఖంగారు పెడుతోంది. పూర్తి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినప్పటికీ దీనికి 160 కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ టాక్. బ్రేక్ ఈవెన్ జరగాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. అయితే నిర్మాతగా కరణ్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్, ఓటిటి, మ్యూజిక్ కు వచ్చిన క్రేజీ ఆఫర్స్ వల్ల పెట్టుబడి మొత్తాన్ని ఆల్రెడీ వెనక్కు తీసుకున్నాడు.
ఇప్పుడు థియేట్రికల్ రన్ కీలకం కాబోతోంది. అయితే ఓవర్సీస్ ఆడియన్స్ దీని పట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోవడం షాక్ కలిగించే విషయం. దానికి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమాధానం ఉంది. జూలై నెలలో మూవీ లవర్స్ మిషన్ ఇంపాజిబుల్ 7, ఓపెన్ హెయిమర్, బార్బీలను చూసేందుకు బాగా ఖర్చు పెట్టేశారు. ఫ్యామిలీస్ తో చూసి జేబులు ఖాళీ చేసుకున్నారు. అలాంటప్పుడు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని కోసం మళ్ళీ టికెట్లు కొనే మూడ్ లో లేరంటున్నారు. నెలాఖరు కావడంతో జనాల మూడ్ ఎంటర్ టైన్మెంట్ వైపు లేదనేది వాళ్ళ వెర్షన్.
ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సాఫ్ట్ గా నడిచే రామ్ కామ్ లు ఈ మధ్య ఎక్కువ వచ్చాయి. తూ ఝూటి మై మక్కర్, జర హట్కె జర బచ్కె, సత్య ప్రేమ్ కి కథ, బవాల్ చూసి బోర్ కొట్టేసిన పబ్లిక్ పఠాన్ లాంటి మాస్ మసాలా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ అంటే ఆసక్తి చూపించరు. ఇదే ట్రెండ్ కనక కొనసాగితే కొంపలు కొల్లేరు కావడం ఖాయం. ఇప్పటిదాకా మల్టీప్లెక్సుల బుకింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. రణ్వీర్ సింగ్, అలియా భట్ లాంటి క్రేజీ కాంబినేషన్ కు సైతం ఆశించిన క్రేజ్ లేకపోవడం ఊహకందని విచిత్రం.