నెలల తరబడి ఎడతెగని ప్రహసనంగా సాగిపోతున్న గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ ఇండియన్ 2 మీద ఆధారపడి ఉండటంతో దర్శకుడు శంకర్ నిర్ణయం మీదే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయి. దీని తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. పైకి ఏం హడావిడి కనిపించడం లేదు కానీ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్లస్ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని కోసం పెద్ద ప్లానింగే అమలులో ఉంది.
ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయబోయే ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాకు మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారట. విజయ్ సేతుపతిని లాక్ చేశారని, షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాక అప్పుడు ఆయన అందుబాటుని బట్టి కాల్ షీట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉప్పెనతో తనకు పెద్ద పేరు ఇచ్చిన బుచ్చిబాబు నుంచి అంతకు మించిన క్యారెక్టర్ వచ్చేసరికి మక్కల్ సెల్వన్ సంతోషం వ్యక్తం చేశారట. ఇక మాజీ హీరోయిన్ లయకో కీలక పాత్ర ఇచ్చారని తెలిసింది. ఇది షాకింగ్ గా ఉంటుందని, రమ్యకృష్ణ రేంజ్ నటీమణులు పోషించే రోల్ లో లయ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారట.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఏఆర్ రెహమాన్ సంగీతం మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తానీ ప్రాజెక్టు చేస్తున్నట్టు ఆయనే స్వయంగా చెప్పడంతో డౌట్ తీరిపోయింది. కాకపోతే రెహమాన్ నుంచి బెస్ట్ ఆల్బమ్ రాబట్టుకోవడం బుచ్చిబాబు చేతుల్లో ఉంది. గేమ్ చేంజర్ కు గుమ్మడి కాయ కొట్టడానికి ఫిబ్రవరి వచ్చేలా ఉంది. అదే జరిగితే 2024 దీపావళి లేదా దసరా తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇది తెలిసే నిర్మాత దిల్ రాజు టీమ్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. సంక్రాంతికి టీజర్ వదిలే ఆలోచనైతే ప్రస్తుతానికి చేస్తున్నారు.