క్రిస్టఫర్ నోలన్ అంటే ఇప్పుడు ప్రపంచ సినిమాలో నంబర్ వన్ డైరెక్టర్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. నిజానికి ప్రస్తుతం అనే కాదు.. మొత్తంగా ప్రపంచ సినిమా చరిత్ర తీసుకున్నా అత్యంత గొప్ప దర్శకుల్లో అతను ముందు వరుసలో ఉంటాడు. మొమెంటో, బ్యాట్ మ్యాన్, ఇన్‌సోమ్నియా, ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ లాంటి సినిమాలతో నోలన్ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.
అతడికి ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానగణం ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అక్కడి జనాలు తన మీద చూపించే అభిమానం నోలన్‌కు కూడా బాగానే తెలిసినట్లుంది. ఇప్పుడు ఆయన్నుంచి వచ్చిన ఓపెన్‌హైమర్ సినిమాలో నోలన్ ప్రత్యేకంగా భగవద్గీత ప్రస్తావన తేవడమే ఇందుకు సూచిక. ఓపెన్‌హైమర్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హీరో సిలియన్ మర్ఫీ భగవద్గీత ప్రస్తావన తేవడం.. అందులోని కొన్ని లైన్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అదేదో కాకతాళీయం కాదని.. సినిమాతోనూ కనెక్షన్ ఉందని అప్పుడే అర్థమైంది. ఇక శుక్రవారం రిలీజైన సినిమాలో భగవద్గీతతో ముడిపడ్డ ఒక ముఖ్య సన్నివేశం కూడా ఉంది. సంస్కృతంలో ఉన్న భగవద్గీతను హీరోయిన్లలో ఒకరు హీరో ఇంట్లో చూసి అది చదవమని అనడం.. అతను ఆ భాష తెలియకపోయినా భావం తెలుసు అంటూ.. ఇందులో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా And now I am become death. Destroyer of worlds అనే వాక్యాన్ని ఉచ్ఛరించడం జరుగుతుంది.
ఓపెన్‌హైమర్ కోసం తొలి రోజు థియేటర్లకు వరుస కట్టిన ఇండియన్ ఆడియన్స్ ఈ సీన్ చూసి వెర్రెత్తిపోతున్నారు. థియేటర్లో ఈ సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నోలన్ లాంటి గ్రేట్ డైరెక్టర్ సినిమాలో ఇలా భగవద్గీత ప్రస్తావన ఉండటం ఇండియన్స్‌కు గొప్పగా అనిపించే విషయమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates