పెళ్లిలో తుపాకీ గురి పెట్టి పాడించాడు

ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రైన ప్ర‌ముఖ సింగ‌ర్‌(గాయ‌కుడు)  సుధీర్ య‌దువంశీకి అత్యంత క‌ఠిన మైన అనుభవం ఎదురైంది. తుపాకీ గురి పెట్టి మ‌రీ ఓ వ్య‌క్తి త‌న‌ను పాట పాడ‌మ‌ని ఒత్తిడి చేసిన‌ట్టు సుధీర్ తాజాగా వెల్ల‌డించాడు. సాధార‌ణంగా ఉన్న‌త స్థాయి వ‌ర్గాల కుటుంబాల్లో ఏదైనా వేడుక జ‌రిగితే.. దీనికి ముందు సంగీత్ ను నిర్వ‌హించ‌డం కామ‌నే.

కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆట‌పాట‌ల‌తో వేడుక‌కు శ్రీకారం చుడ‌తారు. ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా హాజ‌ర‌వుతారు. ఇలానే ఒక వివాహ వేడుక‌కు ప్ర‌ముఖ గాయ‌కుడు సుధీర్ య‌దువంశీ కూడా హాజ‌ర‌య్యారు. ఈయ‌న ప్ర‌ముఖ గాయ‌కుడ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఈయ‌న ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లిన త‌ర్వాత‌.. ఒక వ్య‌క్తి ఆయ‌న ప‌ట్ల అత్యంత అనుచితంగా వ్య‌వ‌హ‌రించాడ‌ట‌.

“నేను రాసిన పాట‌ను పాడు. అని ఆ వ్య‌క్తి అడిగాడు. అయితే.. నేను నిరాక‌రించాను. ఇక్క‌డ‌కు కుద‌ర‌దు అని చెప్పాను. కానీ, అత‌ను న‌న్ను వేధించ‌డం ప్రారంభించాడు. అయినా త‌ట్టుకున్నాను. కానీ, కొంత సేప‌టికి వివాహ వేదిక‌ను దిగిపోతున్న న‌న్ను అత‌ను అనుస‌రించాడు. నాకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాడు. హ‌ఠాత్తుగా తుపాకీని బ‌య‌ట‌కు తీశాడు. నాకు గురి పెట్టాడు. పాట పాడ‌తావా లేదా! అని ఒత్తిడి చేశాడు. నేను హ‌డ‌లి పోయాను” అని సుధీర్ తెలిపారు.

“అంతేకాదు.. తుపాకీ నావైపు గురి పెట్టి.. పాట పాడితేనే వివాహ వేదిక‌ను దిగి కింద‌కి లేక‌పోతే.. అంటూ తీవ్రంగా హెచ్చ‌రించాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్క‌సారిగా భ‌య‌ప‌డిపోయాను. ఏమీ ఆలోచించే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక‌, చేసేది ఏమీలేక‌.. అత‌నీ ఈగోను సంతృప్తి ప‌రిచేందుకు.. ఆ పాట‌ను పాడాను. ఒక్క‌సారికాదు.. ఏకంగా మూడు సార్లు” అని సుధీర్ వివ‌రించారు.