బన్నీ మాటలకు చిరు ఫ్యాన్స్ హ్యాపీ

నిన్న జరిగిన బేబీ అప్రిసియేషన్ మీట్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా తనను ఎంతగా నచ్చిందో చెప్పడమే కాక ఇతర ఆసక్తికరమైన విశేషాలు పంచుకుని స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. గత కొంత కాలంగా బన్నీ ఎక్కడ ఎలాంటి ఈవెంట్ లో పాల్గొన్నా చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం లేదని మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీని గురించే ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అల్లు శత జయంతికి కలిసి కనిపించినా కూడా వాళ్ళ అనుమానాలు తీరలేదు. ఫైనల్ గా కొంత చెక్ అయితే పడింది.

వేదిక మీద బన్నీ మాటల్లో నిర్మాత ఎస్కెఎన్ ప్రస్తావన వచ్చినప్పుడు అతను కట్టెకాలే వరకు చిరంజీవి ఫ్యానని ఆ అంశమే అల్లు శిరీష్ ద్వారా తన దగ్గరికి తీసుకొచ్చేలా చేసిందని చెప్పారు. అంటే ఒకవేళ అతను మెగాస్టార్ అభిమాని కాకపోయి, సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే ఇక్కడి దాకా వచ్చే వాడు కాదన్న విషయం స్పష్టం చేశాడు. అంతే కాదు ఎస్కెఎన్ హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో ఎక్కడ ఉంచాలో తెలియక తాను ప్రాక్టీస్ చేసుకునే చిరంజీవి డాన్స్ ఫ్లోర్ లో ఒక చిన్న గదిని అతనికి ఇచ్చామని ఇప్పటిదాకా ఎవరికి తెలియని ఒక కొత్త ముచ్చట పంచుకున్నాడు.

ఇక్కడితో ఆగలేదు. పుష్ప 2 డైలాగు గురించి మాట్లాడుతూ ఇలా చెప్పడం చిరు లీక్స్ కన్నా డేంజరని నవ్వులు పూయించాడు. ఇలా పలుమార్లు మావయ్య ప్రస్తావన తేవడంతో మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఒక కుటుంబంగా మేమంతా ఒకటేనని పదే పదే అల్లు, కొణిదెల కుటుంబాలు స్పష్టం చేస్తున్నా సరే సోషల్ మీడియా అపార్థాలు వేరుగా ఉంటున్నాయి. బేబీని విపరీతంగా ఇష్టపడిన అల్లు అర్జున్ సినిమా బృందం మీద విపరీతమైన పొగడ్తల వర్షం కురిపించేశాడు. రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండబోతున్న ఈ బ్లాక్ బస్టర్ జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు.