అనిల్ సుంకర ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడు. ఆయన సంస్థ నుంచి ఏప్రిల్ నెలాఖర్లో ‘ఏజెంట్’ సినిమా వచ్చింది. ఆ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు అని అనిలే స్వయంగా పేర్కొన్నాడు. మంచి హైప్ మధ్య రిలీజైన ఆ సినిమా ఫుల్ రన్లో అందులో పదో వంతు షేర్ కూడా రాబట్టలేకపోయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం కలుపుకున్నా పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయాడు అనిల్.
కానీ ఇదే నిర్మాత లో బడ్జెట్లో ‘సామజవరగమన’ అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ ఏమీ లేదు. కానీ విడుదల తర్వాత మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయి ముంగిట నిలిచింది. యూఎస్ లో కేవలం రూ.25 లక్షలకు సినిమా హక్కులు కొంటే ఏకంగా మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిందీ చిత్రం. షేర్ దాదాపు రూ.4 కోట్లు. అంటే ఇది ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు.
ఒక నిర్మాత పెద్ద బడ్జెట్ పెట్టి, ఎంతో హడావుడి చేసి రిలీజ్ చేసిన పెద్ద సినిమా చేదు అనుభవాన్ని మిగిలిస్తే.. తక్కువ బడ్జెట్ పెట్టి ఏ హంగామా లేకుండా రిలీజ్ చేసిన చిన్న సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమాలతో చేతులు కాల్చుకోవడం కంటే కంటెంట్‌ను నమ్మి చేసే చిన్న సినిమాలు ఎంతో బెటర్ అనే అభిప్రాయం కలుగుతోంది. గత వీకెండ్లో వచ్చిన ‘బేబి’ కూడా ఈ అభిప్రాయం మరింత బలపడేలా చేస్తోంది. ఈ సినిమాకు పబ్లిసిటీతో కలిపితే అయిన బడ్జెట్ రూ.10 కోట్లు.
కానీ ఈ చిత్రం వీకెండ్లోనే కేవలం థియేట్రికల్ వసూళ్లతోనే అంతకంటే ఎక్కువ షేర్ రాబట్టింది. కేవలం రెండు రోజుల్లోనే బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేశారు. ఆదివారం నుంచి లాభాలు వస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. బయ్యర్లలో ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం అందుకోబోతున్నారు. ఇక నిర్మాతల సంగతి చెప్పాల్సిన పని లేదు. పెట్టుబడిపై మూడు రెట్ల లాభం వచ్చినా ఆశ్చర్యం లేదు. దీంతో మరోసారి ఇది కదా సక్సెస్ అంటే అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.