తేజుకి తత్వం సత్యం బోధపడింది

ఇంకో తొమ్మిది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో బ్రో ప్రమోషన్ల బాధ్యతని సాయి ధరమ్ తేజ్ తన భుజాల మీదకు తీసుకున్నాడు. హీరోయిన్ కేతిక శర్మ రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నా, ఇవాళ్టి నుంచి ప్రియా వారియర్ రంగంలోకి దిగినా వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ పెద్దగా ఉండదు కాబట్టి భారం సుప్రీమ్ హీరో మీదే ఉంది. ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ మూవీకి తక్కువ బజ్ కనిపించడం బ్రో విషయంలోనే జరుగుతోంది. దానికి మొదటి కారణం తమన్ ఇచ్చిన రెండు పాటలేనని వేరే చెప్పనక్కర్లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సైతం లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తోంది.

ఇదంతా తేజుకి, టీమ్ కి తెలియకుండా పోలేదు. సోషల్ మీడియాలో అభిమానుల హ్యాండిల్స్ చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి తేజ్ సైతం వాస్తవాన్ని అంగీకరిస్తున్నాడు. జాణవులే సాంగ్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడం, అందులో స్టెప్స్ వేయడానికి తాను ఇబ్బందిగా కదలడం తన దృష్టికి వచ్చిందని మీడియాతో ఓపెన్ గానే చెప్పేస్తున్నాడు. యాక్సిడెంట్ వల్ల శరీరంలోకి వచ్చిన మార్పులు మళ్ళీ సెట్ కావడానికి కొంత టైం పడుతుందని, అందుకే త్వరలో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నట్టు చెప్పేస్తున్నాడు. సత్యం తత్వం అర్థం చేసుకోవడం ఇదే.

విరూపాక్షలోనూ తేజు పరుగులు పెట్టే షాట్స్ లో ఫిజిక్ పరంగా కొంచెం తేడానే అనిపించాడు. అది ప్రమాదానికి ముందు ఒప్పుకున్న సినిమా కావడంతో పూర్తి చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నాడు. ఇక బ్రో కేవలం మావయ్య పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశాన్ని వదలకూడదనే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఇప్పుడా లాంఛనం కూడా అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్, జులై 28 బ్రో థియేటర్లలో అడుగు పెట్టాక ఇంక టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. రిపబ్లిక్ ఫ్లాప్ గాయం విరూపాక్ష సగం తగ్గించేసింది. ఇక బ్రో కూడా హిట్ కొడితే కొంత కాలం రెస్ట్ కి వెళ్లిపోవచ్చు.