ఇంకో రెండు వారాల్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బ్రో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకూ తెలంగాణలోనే కాక ఏపీలో కూడా టికెట్ల ధరల పెంపుకి అనుమతి ఇస్తున్నారు. అలాగే స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. గత నెలలో ప్రభాస్ సినిమా ఆదిపురుష్‌కు కూడా ఈ సౌలభ్యం దక్కింది. ఏపీలో 20 శాతం షూటింగ్ చేస్తేనే ఈ సౌలభ్యాలు అంటూ ఇంతకుముందు ఇచ్చిన జీవోనేమీ పట్టించుకోవడం లేదు.
అలాంటపుడు పవన్ సినిమాకు కూడా రేట్ల పెంపు, అదనపు షోలకు అవకాశం ఇవ్వాల్సిందే. కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ సినిమాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలిసిందే. కేవలం వకీల్ సాబ్ అనే సినిమాను దెబ్బ కొట్టే క్రమంలో పాత జీవోలేవో చూపించి మొత్తంగా అన్ని సినిమాలకూ టికెట్ల ధరలు తగ్గించేయడం.. ఏడాదికి పైగా ఈ వ్యవహారాన్ని సాగదీసి చివరికి ఇండస్ట్రీ ప్రముఖులు వచ్చి విన్నపాలు చేశాక కానీ రేట్ల పెంపుకి అవకాశం ఇవ్వకపోవడం గుర్తుండే ఉంటుంది.
నిబంధనలు మారాక రిలీజవుతున్న పవన్ సినిమా బ్రోనే. మరి ఈ సినిమా విషయంలో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మామూలుగానే పవన్ అంటే జగన్‌కు, వైసీపీ వాళ్లకు పడదు. పైగా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేనాని మీద మరింత మంటెత్తిపోతున్నారు. ఈ వ్యవహారం రెండు రోజులుగా ఏపీలో కాక రేపుతోంది. దీంతో పవన్ సినిమాను టార్గెట్ చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేట్ల పెంపు, అదనపు షోల విషయంలో అడ్డంకులు సృష్టించడమే కాక.. సినిమా ప్రదర్శనలకూ ఇబ్బందులు కలిగేలా చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. జనసైనికులు రగిలిపోతారు. వారిలో కసి పెరుగుతుంది. అలాగే వకీల్ సాబ్ రోజుల నుంచి పవన్‌ను ఎలా ఇబ్బంది పెడుతున్నదీ జనానికి మళ్లీ గుర్తు చేసినట్లవుతుంది. అది జగన్ సర్కారుకు చేటే అనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates