ఓ మై బేబీ.. ఆడియ‌న్స్ త‌ట్టుకోగ‌ల‌రా?

ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సినిమాల్లో మంచి క్రేజ్ సంపాదంచుకున్న‌ది బేబీనే. ఈ సినిమా ప్రి లుక్ పోస్ట‌ర్ నుంచే ఒక ర‌క‌మైన క్యూరియాసిటీని క‌లిగిస్తూ వ‌చ్చింది. హృద‌య కాలేయం లాంటి సెటైరిక్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయి.. జాతీయ అవార్డుల్లో స‌త్తా చాటిన క‌ల‌ర్ ఫొటో మూవీకి క‌థ అందించ‌డంతో పాటు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాయిరాజేష్ రూపొందించిన చిత్ర‌మిది.

ఈ సినిమా నుంచి కొన్ని నెల‌ల ముందు రిలీజ్ చేసిన ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ యూట్యూబ్‌లో, సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా లాంచ్ చేసిన ట్రైల‌ర్ కూడా మంచి స్పంద‌న తెచ్చుకుంది. ప్రి రిలీజ్ బ‌జ్ బాగా ఉన్న ఈ సినిమాను జులై 14న విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సెన్సార్ కూడా పూర్తి చేశారు.

ఆల్రెడీ యుఎస్‌కు బేబీ కేడీఎంలు కూడా డెలివ‌రీ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డి నుంచే ఈ సినిమా నిడివి గురించి స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. ఏకంగా 2 గంట‌ల 58 నిమిషాల ర‌న్‌టైమ్‌తో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ రోజుల్లో దాదాపు మూడు గంట‌ల నిడివి అంటే ప్రేక్ష‌కులు త‌ట్టుకోగ‌ల‌రా అన్న‌ది డౌట్. అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు 3 గంట‌ల ర‌న్‌టైంతోనే అద్భుతాలు చేసిన మాట వాస్త‌వ‌మే.

ఇటీవ‌ల ఆదిపురుష్ కూడా దాదాపు అంత ర‌న్‌టైంతోనే రిలీజైంది. కానీ బేబీ లాంటి చిన్న సినిమా, పైగా ల‌వ్ స్టోరీకి ఇంత నిడివి అంటే చాలా ఎక్కువ అనే అనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు క్రిస్ప్ ర‌న్ టైంతో ఉంటేనే బాగుంటుందేమో. క‌థ‌లో ఎన్ని మ‌లుపులున్నా.. ఎమోష‌న్లు వ‌ర్క‌వుట్ అయినా కూడా.. మ‌రీ అంత‌సేపు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లో కుదురుగా కూర్చోబెట్ట‌డం అంటే స‌వాలే. మ‌రి సాయిరాజేష్ కాన్ఫిడెన్స్ ఏమిటో?