2019లో జీరో డిజాస్టర్ అయ్యాక ఏకంగా మూడేళ్లు ఖాళీగా ఉన్న షారుఖ్ ఖాన్ కు పఠాన్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి మతిపోయేలా చేసింది. తన ఇమేజ్ ని సరిగ్గా వాడుకోవాలే కానీ యావరేజ్ యాక్షన్ డ్రామాని సైతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురిపించే కామధేనువులా మార్చడం తనకే చెల్లింది. సెప్టెంబర్ 7న రాబోయే జవాన్ మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తమిళ దర్శకుడు ఆట్లీ రూపొందిస్తున్న ఈ రివెంజ్ గ్రాండియర్ పై బాలీవుడ్ ట్రేడ్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు.
అసలు మ్యాటర్ కు వస్తే జవాన్ కన్నా ఎక్కువ హైప్ తో డిసెంబర్ 22న రాబోతున్న చిత్రం డుంకీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సోషల్ ఎంటర్ టైనర్ లో షారుఖ్ ని ఎన్నడూ చూడని పాత్రల్లో దర్శనం ఇవ్వబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని ఓటిటి హక్కుల కోసం జియో సినిమా అక్షరాలా 155 కోట్లు చెల్లించిందని మీడియా టాక్. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా కేవలం ఒక సింగల్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ కి ఇంత రేట్ పలకడం ఇదే మొదటిసారి. హిందీ వెర్షన్ మాత్రమే ఈ రేట్ కి డీల్ చేశారు. 2024 ప్రారంభంలోనే స్ట్రీమింగ్ జరిగే ఛాన్స్ ఉంది.
ఇంత పెద్ద రికార్డు సాధించడం మాములు విషయం కాదు. ఇప్పటిదాకా డుంకీ గురించి ఎలాంటి లీక్స్ లేవు. అయినా సరే హీరో దర్శకుడి కాంబినేషన్ వల్ల ముఖేష్ అంబానీ బృందం అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధ పడింది. ఓటిటి రంగంలో దూసుకుపోవాలనే లక్ష్యంతో గత మూడు నెలలుగా కొత్త సినిమాలను వరసబెట్టి రిలీజ్ చేస్తున్న జియో సినిమాకు డుంకీ అతి పెద్ద బూస్ట్ కానుంది. 2018 సంజు తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తీసుకుని రాజ్ కుమార్ హిరానీ తీసిన మూవీ కావడంతో ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ ఓ రేంజ్ లో ఉంది. డుంకీలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తోంది.