నీల్ ఎందుకు నిరాశపరిచినట్టు

రాత్రి సరిగ్గా నిద్రపట్టక ఉదయం అయిదు కావడం ఆలస్యం సలార్ టీజర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులను, మూవీ లవర్స్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తిగా సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. తొంబై సెకండ్ల వీడియోలో కనీసం ప్రభాస్ మొహాన్ని స్పష్టంగా చూపించకపోవడం, ఒక్క డైలాగ్ ని చెప్పించకపోవడం నిరాశకు గురి చేసింది. విజువల్స్, యాక్షన్ గ్రాండియర్ కెజిఎఫ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్నా సరే పబ్లిక్ ఆశించింది మాత్రం ఇది కాదు. కేవలం ఇంగ్లీష్ మాటలతో వచ్చిన సింగిల్ లాంగ్వేజ్ టీజర్ కాబట్టి యూట్యూబ్ రికార్డులకు ఢోకా లేనట్టే

ఇదంతా ఓకే కానీ ప్రశాంత్ నీల్ ఇలా ఎందుకు చేశాడనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. కానీ బెంగళూరు మీడియా టాక్ వేరుగా ఉంది. సలార్ కి బిజినెస్ వర్గాల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో రేట్లు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ ధరకు అమ్మడం కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు అవసరం లేదన్నది నీల్ భావన. అలాంటప్పుడు ఆడియన్స్ అంచనాలను వీలైనంత అండర్ ప్లే చేయడం వల్ల అతిగా ఊహించుకుని రాకుండా డైరెక్ట్ గా స్క్రీన్ మీద తాను ఇచ్చే సర్ప్రైజ్ లను చూసి షాక్ అవుతారనేది దర్శకుడి ప్లాన్ గా చెబుతున్నారు.

వినడానికి బాగానే ఉంది కానీ రాజమౌళి కూడా ఇలాగే అలోచించి ఉంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లకు అసలు పబ్లిసిటినే చేసేవాడు కాదుగా. సలార్ సీజ్ ఫైర్ మొదటి భాగమే కాబట్టి అసలు ఇందులో ఏముందో, ఎంతవరకు ఉంటుందో ఎవరూ ఒక కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. కెజిఎఫ్ ఛాయలు, పోలికలు ఎంత లేదన్నా స్పష్టంగా కనిపిస్తుండటంతో రెండింటి మధ్య లింకుని కొట్టిపారేయలేని పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగా రాఖీ భాయ్, సలార్ లు కనక తెరమీద కనీసం కొన్ని సెకండ్లు పాటు కలుసుకున్నా భీభత్సం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే