మేం ఫేమస్ అక్కడ దొరికిపోయింది

థియేటర్ రిలీజ్ జరిగిన టైంలో మేం ఫేమస్ కి జరిగిన హడావిడి మాములుగా లేదు. ట్విట్టర్ లో వచ్చిన నెగటివిటి నిర్మాతలు అంగీకరించకుండా దాని మీద ఏకంగా ప్రెస్ మీట్ పేరుతో పంచాయితీలు పెట్టడం పెద్ద చర్చకే దారి తీసింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సోషల్ మీడియాలు ఏమీ చేయవని తెలిసి కూడా చూపించిన అత్యుత్సాహం కొంత విమర్శలకు తావిచ్చింది. మేము గొప్ప సినిమా తీశామని, యూత్ టాలెంట్ ని ప్రోత్సహించమని పదే పదే హై లైట్ చేసుకున్నారు. ఇంత జరిగినా మేం ఫేమస్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేదు. తక్కువ బడ్జెట్ వల్ల లాభాలొచ్చాయి

కట్ చేస్తే ఈ మేం ఫేమస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పటిదాకా చూడని ఆడియన్స్ సరేలెమ్మని ఓ లుక్ వేశారు. తీరా చూస్తే ఇదేంటి ఇలా ఉందని బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ వరకు ఓ మోస్తరుగా ఓకే అనిపించింది తప్ప మరీ ఆహా, అదరహో అనే రేంజ్ లో మాత్రం లేదని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. షార్ట్ ఫిలింకు సరిపడా కథని రెండున్నర గంటలు తీశారని ట్వీట్లు పెడుతున్నారు. ప్రైమ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ గత వారం ఈ యాప్ లో వేరే  ఓటిటి తెలుగు సినిమా లేకపోవడం కలిసొచ్చింది.

నిజానికి మేం ఫేమస్ మీద ఇంత చర్చ జరగడానికి కారణం మహేష్ బాబు, రాజమౌళిలు విడుదలకు ముందు ఒకరు తర్వాత ఒకరు గొప్ప చిత్రమనే తరహాలో ట్వీట్లు పెట్టడమే. అది ఛాయ్ బిస్కెట్ టీమ్ తో ఉన్న బాండింగ్ వల్ల చేసిందే తప్ప నిజంగా బాగున్న ప్రతి సినిమాను వాళ్ళు ఇలా పొగడరనేది ఓపెన్ సీక్రెట్. ఈ విషయం మీద అవగాహన లేని సామాన్య ప్రేక్షకులు కొంత పొరపడ్డారు. ఏది ఏమైనా మేం ఫేమస్ బ్యాడ్ మూవీ కాదు కానీ మరీ అంతేసి హంగామా చేయాల్సిన విషయమైతే లేదని అధిక శాతం ఆడియన్స్ ఆన్ లైన్లో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.