గత ఏడాది టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ సినిమా ‘కార్తికేయ-2’ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించడం ఆశ్చర్యమేమీ కాదు కానీ.. పాన్ ఇండియా స్థాయిలో ఇది రేపిన సంచలనమే చర్చనీయాంశం అయింది. హిందీలో నామమాత్రంగా రిలీజైన ‘కార్తికేయ-2’.. అంతకంతకూ థియేటర్లు, షోలు, వసూళ్లు పెంచుకుని పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది.
ఏకంగా రూ.120 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ద్వారక నేపథ్యం, శ్రీకృష్ణుడి యాంగిల్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాకు పెద్ద విజయాన్ని అందించాయి. నిఖిల్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేశాయి. మధ్యలో నిఖిల్ నుంచి ‘18 పేజెస్’ సినిమా రాగా దాన్ని తెలుగుకే పరిమితం చేశారు. మళ్లీ పాన్ ఇండియా టచ్ ఉన్న సినిమానే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని నిఖిల్ సంకల్పించడమే ఇందుక్కారణం.
‘స్పై’ అలాంటి సినిమానే అవుతుందని అతను నమ్మాడు. ఇందులో దేశభక్తి యాంగిల్ ఉండటం.. సుభాష్ చంద్రబోస్ పాత్ర సినిమా కథలో కీలకం కావడంతో ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో మ్యాజిక్ చేస్తుందని అతను నమ్మాడు. గాంధీ, నెహ్రూల కంటే బోస్ గొప్పవాడని.. ఇండియాకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిందే ఆయన అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రో ఐడియాలజీతో కొన్ని సన్నివేశాలుండటంతో ఈ చిత్రాన్ని ఉత్తరాదిన వాటి మద్దతుదారులు ఓన్ చేసుకుని పెద్ద హిట్ చేస్తారని ‘స్పై’ టీం ఆశించి ఉండొచ్చు.
‘కార్తికేయ-2’లో అనుపమ్ ఖేర్ లాగా ఇందులో రానా దగ్గుబాటి పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుందని కూడా ఆశించినట్లున్నారు. కానీ ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే.. సినిమాలో కంటెంట్ తగ్గిపోవడం, ఇంటెన్సిటీ లేకపోవడం.. బోస్ యాంగిల్‌ను కూడా సరిగా డీల్ చేయకపోవడంతో తెలుగు వాళ్లకే సినిమా కనెక్ట్ కాలేదు. హిందీ ప్రేక్షకులైతే ఈ సినిమాను అసలు పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. తెలుగేతర భాషల్లో సినిమా నామమాత్రంగా రిలీజ్ అయింది. విడుదల తర్వాత ‘కార్తికేయ-2’లా మ్యాజిక్ జరుగుతుందేమో అనుకుంటే.. అదేమీ కాలేదు. వసూళ్లు కూడా నామమాత్రమే అయ్యాయి.