ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా జనాలు థియేటర్లకు ఖచ్చితంగా వస్తారన్న గ్యారెంటీ లేదు. టాక్ చూస్తే కానీ బయట కాలు పెట్టడం కష్టమైంది. అందుకే ఫస్ట్ డే మార్నింగ్ షో, మ్యాట్నీలను నింపడం గురించి దర్శక నిర్మాతలు చాలా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న రంగబలి మీద ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. యూత్ తో పాటు మాస్ బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందని ట్రైలర్ నమ్మకాన్ని ఇవ్వడంతో ఆ వారం ఎంత పోటీ ఉన్నా ఎడ్జ్ దీనికే దక్కుతుందని భావిస్తున్నారు. నాగశౌర్య కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కమెడియన్ సత్య పలువురు మీడియా సెలబ్రిటీలను ఇమిటేట్ చేస్తూ పాల్గొన్న మిమిక్రి ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వాస్తవానికి నిర్మాణ సంస్థ చెప్పిన ప్రకారం శనివారం ఉదయం పదకొండు గంటలకు యూట్యూబ్ లో వచ్చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. సత్య ఎవరినైతే ఇమిటేట్ చేశాడో వాళ్లలో కొందరు ఇది స్ట్రీమింగ్ కాకుండా చక్రం తిప్పారనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది. అయినా స్పూఫ్ లకు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం జనంలో వ్యక్తమయ్యింది. ఏదైతేనేం ప్రోగ్రాం అయితే రాలేదు.
ప్రస్తుతం దీని గురించి రంగబలి టీమ్ మల్లగుల్లాలు పడుతోంది. ఒకపక్క నెటిజెన్లు ఫుల్ వెర్షన్ ఎప్పుడు పెడతారని డిమాండ్ చేస్తున్నారు. ఇది వదలకపోతే సినిమా చూడమని బెదిరించే బాపతు బయలుదేరారు. సత్య లాంటి అప్ కమింగ్ ఆర్టిస్టు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొవాల్సింది పోయి ఇలా అణిచేయడం వల్ల మరిన్ని అవకాశాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని వస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఏది ఏమైనా చేసింది నేరమేమీ కాదు కాబట్టి రంగబలి బృందం ఈ ఛాన్స్ వదలకుండా ఎంతో కొంత ఎడిటింగ్ చేసి ఇంటర్వ్యూని రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట. చూద్దాం.