ఓపెనింగ్స్ మాత్రం అదరహో..

యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ గురువారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘స్పై’. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఐతే ‘స్పై’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ తెచ్చుకుంది.

ఐతే సినిమాకు ముందు నుంచి ఉన్న పాజిటివ్ బజ్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. రూ.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో నిఖిల్ కెరీర్లో హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా నిలిచింది ‘స్పై’. షేర్ రూ.6 కోట్లకు అటు ఇటుగా వచ్చినట్లు అంచనా. నిఖిల్ రేంజి మారిందనడానికి ఈ ఫిగర్ రుజువు. అతడి సినిమాలకు ఐదారు కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వచ్చేది ఇప్పటిదాకా.

గత ఏడాది ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యాక నిఖిల్ రేంజి మారింది. ‘18 పేజెస్’ లవ్ స్టోరీ కావడం, లో బజ్ ఉండటం వల్ల ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. ‘స్పై’ యాక్షన్ థ్రిల్లర్ కావడం, ప్రోమోలు ఆకట్టుకోవడంతో మంచి వసూళ్లే వచ్చాయి. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మున్ముందు కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.

శుక్రవారం కచ్చితంగా డ్రాప్ ఉంటుంది. వీకెండ్ వరకు మేజర్ డ్రాప్ లేకుండా ఉంటే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేందుకు అవకాశముంటుంది. టాక్ బాలేని నేపథ్యంలో ‘కార్తికేయ-2’లా ఇది ఉత్తరాదిన మ్యాజిక్ చేసే అవకాశాలు లేనట్లే. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ బయ్యర్లకు మరీ ఇబ్బంది అయితే లేకపోవచ్చు.